iDreamPost
android-app
ios-app

కూతురి బర్త్‌డేకు 4 క్వింటాళ్ల టమాటాలు పంచిన తండ్రి!

కూతురి బర్త్‌డేకు 4 క్వింటాళ్ల టమాటాలు పంచిన తండ్రి!

గత నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. కిలో టమాటా 60 నుంచి 250 రూపాయల ధర పలుకుతోంది. సామాన్య జనం టమాటా కొని వంట చేయటానికి జంకుతున్నారు. అలాంటి పేద ప్రజలకు ఓ వ్యక్తి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చాడు. తన కూతురి పుట్టిన రోజున పేద ప్రజలకు టమాటాలు పంచి పెట్టాడు. వంద కిలోలో.. రెండొందల కిలోలో కాదు.. ఏకంగా 4 క్వింటాళ్ల టమాటాలు పంచి పెట్టాడు. ఈ సంఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరిగింది కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది.

అది కూడా హైదరాబాద్‌ మహా నగరంలో. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ పంజాగుట్ట ప్రతాప్‌ నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివ తన కూతురి పుట్టిన రోజును గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నాడు. ప్రస్తుతం టామాటా అధిక ధరల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పేద ప్రజలకు టమాటాలు పంచి పెట్టాలని భావించాడు. ఇందుకోసం ఏకంగా 4 క్వింటాళ్ల టమాటాను సేకరించాడు. దాన్ని కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు పంచి పెట్టాడు.

ప్రజలు ఉచితంగా పంచి పెడుతున్న టమాటాలు తీసుకోవటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. వర్షం పడుతున్నా సరే.. గంటల పాటు క్యూలైన్‌లో వేచి ఉండి మరీ టమాటాలు తీసుకెళ్లారు. ఒక్కో కుటుంబానికి కిలో టమాటాలు పంచి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కేవలం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. నల్ల శివ మంచితనంపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, కూతురి పుట్టిన రోజు సందర్భంగా నల్ల శివ 4 క్వింటాళ్ల టమాటాలు పంచి పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.