iDreamPost

ఆగ‌స్ట్ 15 నుంచి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్, ప్ర‌తి పీహెచ్‌సీలో ఇద్దరు ఫ్యామిలీ డాక్ట‌ర్లు

ఆగ‌స్ట్ 15 నుంచి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్,  ప్ర‌తి పీహెచ్‌సీలో ఇద్దరు ఫ్యామిలీ డాక్ట‌ర్లు

ఇది ప‌ల్లె కోరుకుంటున్న వైద్య స‌దుపాయం. వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం. ఆగస్టు 15 నుంచి పల్లెల్లో డాక్టర్లు వైద్య సేవలందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఏంటీ ఈ ప‌థ‌కం? గ్రామీణ ప్రజలకు సొంత ఊరిలోనే వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్‌. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీలో 1,059 చికిత్సలు మాత్రమే అందితే. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాటిని 2,446కి పెంచింది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరిన్ని చికిత్సలను చేర్చి, చికిత్సల సంఖ్యను 3,000కిపైగా పెంచుతున్నారు. ఆగస్టు 1వతేదీ నుంచి కొత్త చికిత్సలను పథకంలోకి తీసుకొనిరావాల‌ని, అధికారుల‌ను సీఎం ఆదేశించారు. మ‌రి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చేరే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎలా బిల్లు క‌ట్టాలి? దీనికోసం ల‌బ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలి. చికిత్స అందించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రికి చెల్లించాల్సిన డబ్బులు, ముందు రోగి వర్చువల్‌ ఖాతాలోకి జమ అవుతాయి. అనంతరం ఆస్పత్రికి బదిలీ అవుతాయి.

పథకం కింద చికిత్స పొందిన రోగి నుంచి సమ్మతి పత్రం తీసుకోవాలి. ఏ జబ్బుకు చికిత్స చేశారు? ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అనే వివరాలు రోగికి అంద‌చేయాలి. చికిత్స స‌మ‌యంలో ఆస్పత్రిలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? వైద్య‌ సేవలు ఎలా ఉన్నాయి? వీటిమీదా రోగి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ క్రింద చేరిన రోగికి చికిత్స అందించేందుకు ఎవరైనా లంచం అడిగితే, ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14400, వైద్య సేవలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 104 నంబర్లున్నాయి.

చికిత్స త‌ర్వాత‌, డిశ్చార్జి అయి ఇంటికెళ్లిన‌ వెళ్లిన రోగి ఆరోగ్యంపై ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరా తీయాలి. చికిత్స త‌ర్వాత‌ ఏమైనా సమస్యలు వ‌చ్చాయా? రోగి ఆరోగ్య‌ప‌రిస్థితిని తెలుసుకోవాలి. వైద్య సాయం అవసరమైతే, అందేలా చూడాలి. ఆ త‌ర్వాత‌ ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి.

ప్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్ కు ప్రాధాన్య‌త‌నిస్తున్న సీఎం, ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ప‌థ‌కంలో భాగంగా, వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు 104 వాహనంలో వెళ్తారు. మండలానికి రెండు పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి, నలుగురు డాక్టర్ల చొప్పున ప్రభుత్వం నియమిస్తోంది. ఇందులో ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటే, మిగిలిన‌ ఇద్దరూ.. 104 వాహనంలో గ్రామాలకు వెళ్తారు. వ్యక్తిగత శ్రద్ధతో వైద్య సేవలు అందచేస్తారు. వ‌యస్సు మ‌ళ్లిన‌, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇది ఎంతో ఉప‌యోగం. 104 వాహనాలు రెండేళ్ల వ్యవధిలో 1.49 కోట్ల మందికిపైగా సేవలు అందించాయి. 20 రకాల వైద్యసేవలు, 8 రకాల వైద్యపరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజూ 40 వేల మందికి సేవలు అందుతున్నాయి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి