iDreamPost

అటెన్ష‌న్ ప్లీజ్ : ప్ర‌ధానికి మాజీ ప్ర‌ధాని లేఖ

అటెన్ష‌న్ ప్లీజ్ : ప్ర‌ధానికి మాజీ ప్ర‌ధాని లేఖ

క‌రోనా క‌ల‌క‌లంపై మ‌రోసారి తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. సెకండ్ వేవ్ ప్రారంభ‌మై చాలా రోజులైన‌ప్ప‌టికీ మొద‌ట్లో అంత సీరియ‌స్ గా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాలు ఇప్పుడు ఆగ‌మాగం అవుతున్నాయి. పెరుగుతున్న క‌రోనా కేసుల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దీనిపై కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు జ‌రుపుతూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి క‌ర్ఫ్యూ విధింపు వంటి అంశాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించింది. ఇటీవ‌లే సీబీఎస్ఈ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందిస్తూ మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ సూచ‌న‌లు పాటించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇప్పుడు తాజాగా మాజీ ప్ర‌ధాన మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌న్మోహ‌న్ సింగ్ మోదీకి లేఖ రాశారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి కొన్ని కీల‌క‌ సూచనలు చేశారు.

వ్యాక్సినేష‌న్ పై ప్రణాళిక‌

క‌రోనా విజృంభ‌ణ‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన మ‌న్మోహ‌న్.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మోదీని కోరారు. రాబోయే ఆరు నెలల్లో టీకాలు ఎందరికి ఇవ్వాలో నిర్దేశించుకుని, అందుకు తగినట్లుగా టీకా తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వివిధ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను ఏ పద్ధతిలో పంపిణీ చేస్తారో పారదర్శకంగా ప్రకటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం వ్యాక్సిన్లను ఉంచుకోవచ్చునని, మిగిలిన టీకాలను రాష్ట్రాలు తమకు తగిన ప్రణాళిక ప్రకారం వాడుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు.

రాష్ట్రాల‌కే అవ‌కాశ‌మివ్వాలి

కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్నవారిని వర్గీకరించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని తెలిపారు. 45 ఏళ్ళ వయసు లోపువారికి కూడా అవసరమైతే వ్యాక్సినేషన్ చేయడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఉదాహరణను కూడా మన్మోహన్ సింగ్ వివరించారు. అదేమిటంటే, పాఠశాల ఉపాధ్యాయులు, బస్సులు, త్రిచక్ర వాహనాలు, ట్యాక్సీల డ్రైవర్లు, పంచాయతీ సిబ్బంది, కోర్టులకు వెళ్ళే న్యాయవాదులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించవచ్చునని, వారి వయసు 45 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, వారికి టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చునని తెలిపారు.

Also Read : ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై నీలినీడలు!

అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారిగా దేశం

ప్రభుత్వ విధానాల వల్ల గత కొన్ని దశాబ్దాల నుంచి మన దేశం అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఎదిగిందని గుర్తు చేశారు. దీనికి పటిష్టమైన మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ కూడా దోహదపడినట్లు తెలిపారు. ఈ సామర్థ్యం అత్యధికంగా ప్రైవేటు రంగంలో ఉందన్నారు. ప్రస్తుత ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిలో భారత ప్రభుత్వం చురుగ్గా వ్యాక్సిన్ ప్రొడ్యూసర్లకు మద్దతివ్వాలని కోరారు. టీకా ఉత్పత్తిదారులకు నిధులు, ఇతర రాయితీలు ఇవ్వాలని, తద్వారా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించేందుకు సహకరించాలన్నారు. చట్టంలోని నిర్బంధ లైసెన్సింగ్ నిబంధనలను వినియోగించవలసిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఉంటే వ్యాక్సిన్లను తయారు చేయగలిగే కంపెనీలు చాలా ఉన్నాయని తెలిపారు. గతంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి విషయంలో ఈ విధంగా జరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత కోవిడ్-19 విషయంలో ఇజ్రాయెల్ ఇప్పటికే ఈ చర్యలు తీసుకుందని, మన దేశం కూడా ఇజ్రాయెల్‌ను అనుసరించాలని కోరారు.

ఆ టీకాల‌కు అనుమ‌తులు మంజూరు చేయాలి

మన దేశంలో టీకా సరఫరాలు పరిమితంగా ఉన్నందు వల్ల యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ లేదా యూఎస్‌ఎఫ్‌డీఏ వంటి విశ్వసనీయ సంస్థల నుంచి అనుమతి పొందిన టీకాలకు మన దేశంలో కూడా అనుమతులు మంజూరు చేయాలని, మన దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం పట్టుపట్టవద్దని కోరారు. మనం మునుపెన్నడూ లేనంత తీవ్రంగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇటువంటి సడలింపులు అత్యవసర పరిస్థితుల్లో సమర్థనీయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. విదేశీ సంస్థల అనుమతుల ఆధారంగా ఈ వ్యాక్సిన్లను మన దేశంలో అనుమతిస్తున్నట్లు వాటిని వేయించుకునేవారికి స్పష్టంగా చెప్పవచ్చునని తెలిపారు. వ్యాక్సినేషన్‌ను పెంచడం కోవిడ్-19పై పోరాటంలో చాలా కీలకమైనదని తెలిపారు. ఎందరికి వ్యాక్సినేషన్ చేశామని కాకుండా, జనాభాలో ఎంత శాతం మందికి వ్యాక్సిన్ అందిందనేదానిపైనే దృష్టి సారించాలని చెప్పారు. మ‌రి మ‌న్మోహ‌న్ సూచ‌న‌ల‌ను కేంద్రం ఎంత వ‌ర‌కూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read : వలస బతుకులు.. అదే కథ.. అదే వ్యథ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి