iDreamPost

బుట్టా రేణుక పై మైండ్ గేమ్

బుట్టా రేణుక పై మైండ్ గేమ్

తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు, ఆరోపణలు వేడెక్కాయి. ముఖ్యంగా బీజేపీ అసత్యాలనే నమ్ముకొని ప్రచారం చేస్తోంది. ఇందుకు మతాన్ని అడ్డుపెట్టుకొని నీచ రాజకీయానికి పాల్పడుతోంది.

తాజాగా బీజేపీ సోషల్ మీడియాలో వైసీపీ నాయకురాలు, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ నాయకులు తమ పార్టీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు.

వాస్తవానికి బుట్టా రేణుక 2014లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీ సీటుకి బరిలో నిలిచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈమె కుటుంబానికి హైదరాబాద్, ఢిల్లీలలో విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నాయి. దీనితో తప్పని పరిస్థితుల్లో వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లారు. తర్వాత తన తప్పు తెలుసుకొని 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం కూడా చేశారు.

కాగా, ఇటీవల ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలోను ఆమె పాల్గొన్నారు. వైసీపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ, బీజేపీ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుట్టా అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్వలాభం కోసం తమ నేతను అభాసుపాలు చేస్తున్నారంటూ మండి పడుతున్నారు.

ఈ ప్రచారంపై బుట్టా రేణుక కూడా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తనకు పార్టీ మారే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను ప్రస్తుతం వైసీపీలో కంఫర్ట్‌గానే ఉన్నానని, రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని బుట్టా రేణుక స్పష్టం చేశారు.

Also Read : రేవంత్ రెడ్డిలో మార్పు దేనికి సంకేతం..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి