iDreamPost

నిత్య పెళ్లికూతురు.. ఒకరికి తెలియకుండా ఒకరిని.. మహా కిలాడీ లేడి..

నిత్య పెళ్లికూతురు.. ఒకరికి తెలియకుండా ఒకరిని.. మహా కిలాడీ లేడి..

ఓ మహిళ ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం, ఆస్తి కోసం పెళ్లి చేసుకొని, ఆస్తి తన పేరు మీద రాయకపోతే విడాకులంటూ భయపెడుతూ ముగ్గుర్ని మోసం చేసింది కిలాడి లేడి. ఆమె ప్రవర్తనపై మూడో భర్తకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లి కూతురు అసలు కథ బట్టబయలైంది.

నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వై. మేరీ జేసింత అలియాస్‌ (మేరమ్మ) కుమార్తె శిరీషకు మొదట అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పాణ్యం మల్లికార్జున రెడ్డితో పెళ్లి అయింది. అతన్ని ఆస్తి తన పేరు మీద రాయమంది. అతను ఆస్తి తన పేరు మీద రాయకపోవడంతో కాపురం చేయకుండా వచ్చేసింది. ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకోకుండానే అదే మండలంలో కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డిని శిరీష రెండో పెళ్లి చేసుకుంది. ఇక్కడ కూడా ఆస్తి రాయకపోవడంతో మళ్ళీ తిరిగి పుట్టింటికొచ్చేసింది. ఇతనితో కూడా విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వివాహం చేసుకుంది.

గతంలో రెండు సార్లు తమ ఎత్తులు పారకపోవడంతో ఈ సారి మరింత తెలివిగా ఆలోచించారు తల్లీ కూతుళ్లు. వివాహం జరగాలంటే ముందుగా తన కుమార్తె పేరు మీద రూ.5 లక్షల డిపాజిట్‌ చేయాలని తల్లి మేరీ జేసింత పెళ్లి కొడుకు వాళ్ళని అడిగింది. వాళ్ళు సరే అని శిరీష పేరు మీద ఫిబ్రవరి 1న డిపాజిట్‌ చేశారు. దీంతో ఇది చాలదని పెళ్లి అయిన రెండు నెలలకే తన కుమార్తె పేరు మీద ఆస్తి రాసి ఇవ్వాలని, లేకపోతే కాపురానికి పంపనని తల్లి ఎదురు తిరిగింది.

దీంతో తల్లీ, కూతుళ్ళ మీద అనుమానం వచ్చిన మహేశ్వర్‌ రెడ్డి శిరీష గురించి చుట్టుపక్కల గ్రామాల్లో విచారించడంతో అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని తెలిసింది. దీంతో మహేశ్వర్ రెడ్డి శిరీష, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బేతంచెర్ల ఎస్‌ఐ పీ. శ్రీనివాసులు తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ విచారణలో శిరీష నాలుగో పెళ్లి కూడా చేసుకోడానికి రెడీ అయిందని తెలిసి ఈమె మహా ముదురు కిలాడి అనుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి