iDreamPost

Election 2024: ఎలక్షన్ అప్డేట్.. APలో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు

  • Published Apr 18, 2024 | 10:25 AMUpdated Apr 18, 2024 | 10:25 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలు కానుంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలు కానుంది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 10:25 AMUpdated Apr 18, 2024 | 10:25 AM
Election 2024: ఎలక్షన్ అప్డేట్.. APలో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఎలక్షన్ ప్రక్రియలో తొలి అంకం.. నామినేషన్ల పర్వం నేటి నుంచి అనగా గురువారం నుంచి మొదలు కానుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

దీనిలో భాగంగా నేటి నుంచి అనగా ఏప్రిల్ 18-25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్‌ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నామనేషన్ల పర్వంలో భాగంగా పార్లమెంట్‌ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. దాన్ని ఉల్లంఘించకుండా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియను రికార్డు చేసేందుకుగాను వాటిని స్వీకరించే గదిలో.. క్యాండేట్స్ లోపలికి ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమరాలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ. ఆ తర్వాత వీటిని ఏప్రిల్‌ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. ఇక ఏపీలో మే 13న పోలింగ్‌ కాగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గురువారం ఉదయం నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుండగా.. నామినేషన్‌ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్‌) కూడా అభ్యర్థులు కచ్చితంగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్‌ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు.

ఫారం–26 స్టాంప్‌ పేపర్‌ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. ఇంతకు ఇది దేనికి అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన క్రిమినల్‌ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను ఈ ఫారం-26 లో వెల్లడించాల్సి ఉంటుంది.

నామినేషన్‌ ఫీజు వివరాలు..

  • పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు.
  • వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది.
  • నామినేషన్‌ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
  • ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో (2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది.
  • నామినేషన్‌ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయంతో పాటు..
  • నామినేషన్‌ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి.
  • నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది.

నేటి నుంచి ఖర్చు కౌంట్..

  • నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్‌ అవుతుంది.
  • అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు.
  • అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్‌ 25 గురువారం
  • ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ ఏప్రిల్‌ 18 గురువారం
  • నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26 శుక్రవారం
  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్‌ 29 సోమవారం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి