iDreamPost

Drushyam 2 Review : దృశ్యం 2 రివ్యూ

Drushyam 2 Review : దృశ్యం 2 రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరికి జరగని విధంగా రెండు ఓటిటి డైరెక్ట్ రిలీజులు ఒక్క విక్టరీ వెంకటేష్ కు మాత్రమే దక్కాయి. నాని ఆల్రెడీ ఈ ఫీట్ అందుకున్నప్పటికీ అతను ఈ జనరేషన్ లో వస్తాడు కాబట్టి ఒకే గాటన కట్టలేం. ఆరేళ్ళ క్రితం వచ్చిన దృశ్యం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందో ఎవరూ మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత దానికి కొనసాగింపు అంటే ఆసక్తి ఉండటం సహజం. అందులోనూ ఆల్రెడీ మలయాళంలో హిట్టైన సీక్వెల్ కావడంతో అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. థియేటర్ లో చూడాల్సిన ఎక్స్ పీరియన్స్ ని మిస్ చేసుకున్న దృశ్యం 2 సస్పెన్స్ లో ముంచెత్తిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఇది మొదటి భాగానికి స్పష్టమైన కొనసాగింపు. వరుణ్ హత్య కేసులో నుంచి బయటికి వచ్చాక రాంబాబు(వెంకటేష్) థియేటర్ కట్టుకుని స్వంతంగా ఓ సినిమా తీసే ప్లానింగ్ లో ఉంటాడు. దాని కోసం స్వయంగా తనే ఒక కథ సిద్ధం చేసుకుని రచయిత వినయ్ చంద్ర(తనికెళ్ళ భరణి)తో స్క్రిప్ట్ రాయిస్తూ ఉంటాడు. అన్నేళ్లు గడిచినా పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రం మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నధికారి గౌతమ్ సాహు(సంపత్ రాజ్)కు కీలకమైన ఆధారాలు దొరుకుతాయి. దీంతో రాంబాబు కుటుంబం మళ్ళీ స్టేషన్ విచారణ అంటూ పరిస్థితిని మొదటికే తెచ్చుకుంటుంది. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి

నటీనటులు

వెంకటేష్ ఎప్పటిలాగే ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో జీవించేశారు. కాకపోతే ఫస్ట్ పార్ట్ లాగా గుర్తుండిపోయే అద్భుతమైన సీన్లు కానీ. కుటుంబానికి ధైర్యం చెబుతూ ఆకట్టుకునే మాటలు ఇందులో అంతగా లేవు. ఎమోషనల్ సీన్స్ లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వెంకీ బదులు మనకు రాంబాబునే కనిపిస్తాడు. మీనా మరోసారి చక్కగా కనిపించారు కానీ స్వంతంగా చెప్పుకున్నారో ఏమో కానీ డబ్బింగ్ అంతగా అతకలేదు. నదియా, నరేష్, పెద్దమయ్యిగా చేసిన కృతిక, చిన్న కూతురు ఎస్తర్ అనిల్ అందరూ ఎక్స్ టెన్షన్లు అంతే.

భరణి, సంపత్ రాజ్, సత్యం రాజేష్ తదితరులవి రొటీన్ పాత్రలే. రెండు మూడు సీన్లకే పరిమితమైన ఆర్టిస్టులు చాలా ఉన్నారు. అన్నపూర్ణమ్మ, సుజా వరుణే, తమ్మారెడ్డి భరద్వాజ, చమ్మక్ చంద్ర, గౌతమ్ రాజు, సమ్మెట గాంధీ, ముక్కు అవినాష్, తాగుబోతు రమేష్, జబర్దస్త్ చంటి, సివిఎల్ నరసింహం, రాజారవీంద్ర, శిరీష, వేణు, ఆడమ్ అయూబ్ తదితరులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. పూర్ణ, షఫీలకు కాస్త ఎక్కువ స్పాన్ దొరికింది కానీ మరీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే స్థాయిలో కాదు. ఎక్కువ ఫోకస్ రాంబాబు ఫ్యామిలీ మీద పెట్టడంతో ఇంత తారాగణం ఉన్నా పూర్తిగా ఉపయోగపడలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దృశ్యంని దర్శకురాలు శ్రీప్రియ హ్యాండిల్ చేయగా ఈసారి ఆ బాధ్యతను అసలు సృష్టికర్త జీతూ జోసెఫ్ కే ఇచ్చారు. 2014లో అప్పటిదాకా పరిచయం లేని ఒక ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి అద్భుత విజయాన్ని అందించిన డైరెక్టర్ గా ఈయన స్థానం చాలా ప్రత్యేకం. ఒక కొనసాగింపుని పర్ఫెక్ట్ గా రాసుకోవడం అంటే అంత సులభం కాదు. దృశ్యంని ఎక్కడైతే ముగించారో దీన్ని అక్కడి నుంచే కంటిన్యూ చేసి ఒక క్రైమ్ తాలూకు లాంగ్ రన్ షేడ్స్ ఎలా ఉంటాయో ప్రతిభావతంగా తీయాలని ప్రయత్నించడం దృశ్యం 2లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ మేజిక్ ఇందులో సంపూర్ణంగా ఉందా అంటే లేదా అనే చెప్పాలి.

జీతూ జోసెఫ్ ఎలాంటి రిస్క్ చేయలేదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ పూర్తిగా కలర్ జిరాక్స్ తీశారు. నారప్పకు ఫాలో అయిన సూత్రాన్నే నిర్మాత సురేష్ బాబు దృశ్యం 2కి కూడా ఆపాదించారు. మనకు ఆల్రెడీ పరిచయమున్న పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం ఫస్ట్ హాఫ్ ల్యాగ్ కు కారణం అయ్యింది. కథ ముందుకు కదులుతున్న ఫీలింగ్ కలగదు. మలయాళంలోనూ ఇలాగే ఉంది. కానీ మన ఆడియన్స్ వేగాన్ని కోరుకుంటారు. తెలిసిన క్యారెక్టర్లను అంతసేపు రిజిస్టర్ చేయడం కనెక్ట్ కాదు. దీంతో అసలు కథ ఎప్పుడా అనే ఎదురు చూపులు మొదలవుతాయి. గంట దాకా ఈ ప్రహసనం భరించాల్సిందే.

ఇంటర్వెల్ కు ముందు మొదటి ట్విస్టు ఓపెన్ అయ్యాక స్పీడ్ పెరుగుతుంది. దృశ్యం 1లో రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వేసే ఎత్తుగడలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ పూర్తిగా లేకపోయింది. స్టేషన్ లో పాతిపెట్టిన శవం బయట పడ్డాక ఇప్పుడు అతను ఎలా బయటపడతారా అనే కాంఫ్లిక్ట్ తప్ప రాంబాబు ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యే థ్రిల్లింగ్ డ్రామా ఏమీ ఉండదు. రెండు మూడు షాకింగ్ ట్విస్టులు, కోర్టు సీన్లో అసలు నిజం బయట పడినప్పుడు అందరూ షాక్ తినడం లాంటివి సినిమాను డ్యామేజ్ చేయకుండా కాపాడాయి. లేదంటే ఆ ఇంపాక్ట్ తగ్గిపోయి దృశ్యం 2 ఇంకా నిరాశపరిచేది.

ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసుంటే మాత్రం ఫార్వార్డ్ చేయకుండా ఈ దృశ్యం 2ని చూడటం కొంచెం ఇబ్బందే. అలా అని చూడనివాళ్లకు బెస్ట్ అనిపిస్తుందని కాదు. సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, నువ్వు సూపర్ రాంబాబు అనిపించే సీన్లు ఎక్కువ లేకపోవడం లాంటివి పంటి కింద చిన్నరాళ్ల లాంటివి. అయినా కూడా జీతూ జోసెఫ్ లోని మాస్టర్ స్టోరీ టెల్లర్ మైంటైన్ చేసిన టెంపో దీని ఫైనల్ గా పర్వాలేదనిపించేలా చేసింది. సీక్వెల్ కాబట్టి ఖచ్చితమైన పోలిక వస్తుంది కనక అలా చూసుకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ మంచి క్యాపుచినో ఫ్లేవర్ లాంటి కాఫీ అయితే ఇది మాత్రం వేడి తగ్గిన ఇరానీ టీ అని చెప్పుకోవాలి.

రాంబాబుకి కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో హై అనిపించే ఎలివేషన్స్ లేకపోవడం కూడా కొంత మైనస్. పక్కింట్లో సత్యం రాజేష్ జంట, షఫీ పాత్ర, సంపత్ రాజ్ ఎంట్రీ, లాయర్ గా పూర్ణ లాంటి అదనపు హంగులు జోడించినా కూడా దృశ్యం 2 ఎందుకో ఏదో మిస్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ చాలా కన్వీనియంట్ గా పక్కన పెట్టేసినా కూడా ప్రాపర్ ప్రెజంటేషన్ ఫైనల్ గా ఒకే అనిపించేలా సాగింది. ఇప్పటికైతే దృశ్యం 2 ముగించారు కానీ మూడో భాగానికి అవసరమైన లీడ్ ని సెట్ చేసి పెట్టారు. వెంకటేష్ చెప్పినట్టు దాన్ని తీసే అవకాశం లేకపోలేదు.

అనూప్ రూబెన్స్ పనితనం పెద్దగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత స్వంతం కొంత ఒరిజినల్ నుంచి తీసుకున్నది అనిపిస్తుంది. ఫైనల్ గా బెస్ట్ బిజిఎం అనిపించే స్టాండర్డ్ లో అయితే లేదు. పేరుకి పాట పెట్టారు కానీ ఎమోషనల్ సాంగ్ కావడంతో అంతగా గుర్తుండదు. సతీష్ కురుప్ ఛాయాగ్రహణం బాగానే ఉంది. టెక్నికల్ టాలెంట్ చూపించుకోవడానికే స్కోప్ ఉన్న సబ్జెక్టు కాకపోవడంతో పనితనం నీట్ గా సాగింది. మార్తాండ్ కె వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ సైతం రీమేక్ కావడంతో ల్యాగ్ వద్దని చెప్పలేకపోయారేమో. ఆర్ సామల మాటలు మాములుగా సాగాయి. చాలా తక్కువ బడ్జెట్ కు నలుగురు నిర్మాతలు ఉండటం విశేషం

ప్లస్ గా అనిపించేవి

వెంకటేష్
మెయిన్ ట్విస్టు
రెండో సగం

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్ ల్యాగ్
థ్రిల్స్ తగ్గడం
నిడివి

కంక్లూజన్

ఒకవేళ ఈ దృశ్యం 2 థియేటర్లో వచ్చి ఉంటే ఎలా ఉండేదన్న ఊహ పక్కనపెడితే ఓటిటి ఆప్షన్ లో ఇంట్లోనే చూసే వెసులుబాటుతో రిలీజయ్యిందనే కోణంలో ఇది ఓసారి చూడొచ్చని చెప్పొచ్చు. కాకపోతే ఆరేళ్ళ క్రితం దృశ్యంని మనసులో పెట్టుకుని అంతకు మించి అనే రేంజ్ లో ఏవేవో ఊహించేసుకుంటే మాత్రం కొంత నిరాశ తప్పదు. రాంబాబు నుంచి ఆశించే హై వోల్టేజ్ ఫ్యామిలీ థ్రిల్ ఇందులో తగ్గిన మాట వాస్తవం. దాన్ని అంగీకరిస్తూ ఎంజాయ్ చేయగలిగితే ఓకే. అలా కాకుండా ఇప్పటికీ గుర్తుండిపోయిన దృశ్యం 1 తాలూకు జ్ఞాపకాలతో ఎక్కువ ఆశించకపోవడం బెటర్. డిజిటల్ కాబట్టి హ్యాపీగా పలకరించేయండి

ఒక్కమాటలో – కలర్ తగ్గింది

Also Read : Adbhutham Movie Review : అద్భుతం రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి