iDreamPost

నక్సలిజం మీద ‘ద్రోహి’ ముద్ర – Nostalgia

నక్సలిజం మీద ‘ద్రోహి’ ముద్ర – Nostalgia

నక్సలిజం మీద సినిమాలు రావడం చాలా అరుదు. ఎందుకంటే వీటికి విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందులోనూ ఈ కాన్సెప్ట్ సామాన్య జనానికి అర్థమయ్యేది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేది కాదు. అందుకే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే వీటిని ఇష్టపడతారు. అయితే పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ చేసినప్పుడు మాత్రం అంచనాలు ప్రత్యేకంగా నెలకొంటాయి. అలాంటి ఉదాహరణే ద్రోహి. 1994లో హిందీలో ‘ద్రోహ్ కాల్’ వచ్చింది. గోవింద్ నిహలాని దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీ విమర్శకులను అబ్బురపరిచింది. చాలా సున్నితమైన కథాంశాన్ని ఆలోచింపజేసేలా తీర్చిదిద్దిన తీరు ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకొచ్చింది.

అదే సంవత్సరం కమల్ హాసన్ ను ద్రోహ్ కాల్ ప్రీమియర్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు గోవింద్ నిహలాని. ఛాయాగ్రాహకుడు పిసి శ్రీరామ్ తో కలిసి ముంబై వెళ్లి సినిమా చూసిన కమల్ కు అది విపరీతంగా నచ్చేసింది. రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే హక్కులు కొనేసుకున్నారు. దర్శకుడిగా శ్రీరామ్ నే ఉండమన్నారు కమల్. అప్పటికాయనకు ‘మీరా’ ఒకటే డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. స్క్రిప్ట్ రాసే బాధ్యతను కమల్ తీసుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో ఓం పూరి, నసీరుద్దీన్ చేసిన పాత్రలను తాను, యాక్షన్ కింగ్ అర్జున్ తో చేయాలని డిసైడ్ అయ్యారు. అక్కడ పెర్ఫార్మన్స్ కి గొప్ప పేరు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్ధి క్యారెక్టర్ కోసం నాజర్ ని ఎంపిక చేసుకున్నారు.

వీళ్లకు జోడిగా గౌతమి, గీతలను తీసుకున్నారు. నెగటివ్ టచ్ ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రకు కె విశ్వనాథ్ ను తీసుకోవడం అప్పట్లో షాక్. టెర్రరిస్టుల అంతం కోసం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆదర్శంగా నిలవడమనే పాయింట్ ని తీసుకుని హిందీతో పోలిక రాకుండా కొన్ని కీలక మార్పులతో పిసి శ్రీరామ్ దీన్ని తమిళ్ లో కురుపుతినాల్, తెలుగులో ద్రోహిగా రెండు వెర్షన్లు విడివిడిగా తీశారు. 1995 అక్టోబర్ 23న విడుదలైన ద్రోహి కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు కానీ ఇలాంటి కథలను ఇష్టపడే వాళ్లకు మాత్రం విపరీతంగా నచ్చేసింది. 68వ అకాడెమీ అవార్డులకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీగా ఎంట్రీ దక్కించుకుంది కానీ వెంట్రుకవాసిలో నామినేట్ కావడం మిస్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి