iDreamPost

అచ్చెన్నకు పార్టీ పగ్గాలు దక్కుతుందా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు

అచ్చెన్నకు పార్టీ పగ్గాలు దక్కుతుందా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ ఏపి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తేల్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకటరావును కొనసాగించటం ఇష్టం లేదు. అలాగని కళాకు రీప్లేస్ మెంటు కు ధీటైన నేత కూడా కనబడటం లేదు. ఉన్నంతలో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే కనబడుతున్నాడు. కానీ అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? అన్నదే సందేహం. ఈ పరిస్దితుల్లో ఎవరికి పగ్గాలు అప్పగించాలో తెలీక చంద్రబాబు అవస్తలు పడుతున్నాడు.

నిజానికి మొన్నటి డిజిటల్ మహానాడులోనే ఈ విషయంలో క్లారిటి వస్తుందని అందరూ అనుకున్నారు. మహానాడు అజెండాలో పార్టీ అధ్యక్షుల మార్పు, కమిటీల ఏర్పాటు అంశాలు కూడా ఉన్నాయి. కానీ చివరి నిముషంలో మొత్తం అజెండా మారిపోవటంతో అధ్యక్షుల మార్పు, కమిటిల ఏర్పాటు అంశమే చర్చకు రాలేదు. దాంతో కొత్త అధ్యక్షుల నియామకం ఎప్పుడు ఉంటున్నది సస్పెన్సుగా మారిపోయింది.

జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్న తర్వాత రాష్ట్రాల అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా చంద్రబాబు, చినబాబు తీసుకోవాల్సిందే. వాళ్ళతో చర్చించిన తర్వాతే రాష్ట్రాల అధ్యక్షులు ప్రకటిస్తారు. కాకపోతే తమ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్దంగా నడుస్తోందని చెప్పుకోవటానికే రాష్ట్రాల అధ్యక్షులు, కమిటిల డ్రామాలు.

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కళాను మార్చేయటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. దానికితోడు నేతలపై కళా పెద్దగా ప్రభావం చూపలేడనే వాదన కూడా బలంగా ఉంది. అదే సమయంలో అచ్చెన్న అయితే ధాటిగా మాట్లాడుతాడు. బలమైన రాజకీయ నేపధ్యమున్న నేతగా చెలామణిలో ఉన్నాడు. పార్టీకి దూరమైన బిసిలను మళ్ళీ అచ్చెన్న దగ్గరకు చేర్చగలడని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ? అన్న విషయాన్ని పక్కనపెట్టేసినా అచ్చెన్న చాలా దూకుడుగా వెళ్ళే నేత అన్నది వాస్తవం. అచ్చెన్న దూకుడు వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు మనసులో ఏముందో మాత్రం తెలీటం లేదు. చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి