iDreamPost

ఆప్‌ ఇతర రాష్ట్రాలలోనూ పాగా వేస్తుందా..?

ఆప్‌ ఇతర రాష్ట్రాలలోనూ పాగా వేస్తుందా..?

దేశ రాజధాని ఢిల్లీలో పురుడుపోసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇప్పుడు మరో రాష్ట్రంలో పాగా వేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్‌ తిరుగులేని విజయం సాధించింది. 117 స్థానాలకు గాను ఏకంగా 92 సీట్లు నెగ్గి అధికారం చేపట్టబోతోంది. ఈ పరిణామం తర్వాత ఆప్‌ తదుపరి ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ, పంజాబ్‌.. తర్వాత ఏమిటినే చర్చ జరుగుతోంది. ఆప్‌ జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందా..? ఇతర రాష్ట్రాలలోనూ అధికారం సంపాదిస్తుందా..? అనే అంశాల చుట్టూ చర్చ జరుగుతోంది.

2012లో కేజ్రీవాల్‌ ఆప్‌ను స్థాపించారు. 2013 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలిచారు. కాంగ్రెస్‌ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. సంకీర్ణ ప్రభుత్వంలో అనుకున్నది చేయలేకపోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి 2015లో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆప్‌ సునామీ సృష్టించింది. 70 సీట్లకు గాను ఏకంగా 67 చోట్ల నెగ్గింది. ఆ తర్వాత ఢిల్లీలో తనదైన మార్క్‌ పాలనకు కేజ్రీవాల్‌ నాంది పలికారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉచిత కరెంట్‌ వంటి పథకాలు అమలు చేశారు. సుపరిపాలన అందించడంతో 2020లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఆప్‌ ఢిల్లీలో జెండా ఎగురవేసింది. ఈ సారి 70 సీట్లకు గాను 63 చోట్ల నెగ్గి.. మూడో సారి కేజ్రీవాల్‌ సీఎం అయ్యారు. ఆ తర్వాతనే కేజ్రీవాల్‌ పార్టీ విస్తరణపై దృష్టి సారించారు.

ఢిల్లీ మోడల్‌ అభివృద్ధి పేరుతో కేజ్రీవాల్‌ ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో నాలుగు సీట్లు గెలుచుకుని ఆప్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. ఆ ఎన్నికల్లో ఆప్‌ 20 సీట్లలో నెగ్గింది. ఈ పరిణామంతోనే ఆప్‌కు పంజాబ్‌లో అధికారంపై నమ్మకం ఏర్పడింది. గత ఎన్నికల్లో స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన ఆప్‌.. ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. ఆప్‌కు అధికారం దక్కుతుందనే అంచనాలు ముందునుంచి ఉన్నాయి. అయితే అందరి అంచనాలకు మించి ఆప్‌ 92 సీట్లను గెలుచుకుంది.

పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్న కేజ్రీవాల్‌కు పంజాబ్‌ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆప్‌.. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లలోనూ పోటీ చేసింది. గోవాలో రెండు సీట్లలో నెగ్గింది. మిగతా చోట్ల బోణి కొట్టలేకపోయింది.

ఈ ఏడాది ఆఖరులో జరిగే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు కేజ్రీవాల్‌ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు గుజరాత్‌లో పర్యటించారు. పార్టీని బలోపేతం చేస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఏమేమి పనులు చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. అయితే పంజాబ్‌లో మాదిరిగా ఇతర రాష్ట్రాలలోనూ ఆప్‌ విజయం సాధిస్తుందా..? అంటే అది అంత సులవైన పని కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పంజాబ్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. ఢిల్లీలో ఉండే పంజాబీలు, వారికి పంజాబ్‌లో ఉండే బంధుత్వాలు ఆప్‌కు కలిసి వచ్చాయి. అంతేకాకుండా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు, బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలు.. ఆప్‌ విజయానికి మరింత ఊతం ఇచ్చాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో పంజాబీలే అధికం.

కేజ్రీవాల్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలపై దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. అయితే ఆప్‌కు అధికారం దక్కే పరిస్థితి ఆయా రాష్ట్రాలలో ఉండే అవకాశం తక్కువ. అధికారం దక్కే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల పక్కన ఉన్న హర్యానాపై కేజ్రీవాల్‌ ఫోకస్‌ పెడితే.. అధికారం దక్కే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలలో పోటీ చేసినా.. గోవాలో మాదిరిగా ఒకటి రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంతిమంగా జాతీయ పార్టీ హోదాను ఆప్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి