iDreamPost

నెలాఖరులోగా కేసీయార్ చెప్పబోయే తీపి కబురు ఏమిటో తెలుసా ?

నెలాఖరులోగా కేసీయార్ చెప్పబోయే తీపి కబురు ఏమిటో తెలుసా ?

నెలాఖరులోగా కేసీయార్ తీపికబురు చెప్పబోతున్నారా ? ఉద్యోగ సంఘాల్లో ఇదే విధమైన చర్చ రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఇంతకీ సిఎం చెబుతారని అనుకుంటున్న తీపి కబురు ఏమిటో తెలుసా ? ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితిని పెంచబోతున్నారట. ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితి 58 సంవత్సరాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచుతానంటూ హామీ ఇచ్చాడు.

అప్పటి ఎన్నికల్లో బంపర్ మెజారిటితో గెలిచిన కేసీయార్ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయాడు. దాంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. మంత్రులు, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని కేసీయార్ ముందుంచారని సమాచారం. అదే సమయంలో ఈమధ్యనే ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో వయోపరిమితిని పెంచే విషయంపై నేతలు గట్టిపట్టుబట్టారట. దాంతో ఇదే విషయమై అవసరమైన కసరత్తు చేయాలంటూ సంబంధిత ఉన్నతాధికారులను కేసీయార్ ఆదేశించినట్లు సమాచారం.

ఈమధ్య ఉన్నతాధికారుల సమీక్షతో పాటు నేతలతో మాట్లాడుతూ తొందరలోనే తాను తీపి కబురు చెబుతానంటూ కేసీయార్ ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో కేసీయార్ చెప్పబోయే తీపికబురు ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచటమే అని ఎవరికివాళ్ళు తీర్మానించేసుకున్నారు. ప్రతి నెల రాష్ట్రం మొత్తం మీద సగటున వెయ్యిమంది రిటైర్ అవుతున్నారు. జూన్-ఆగష్టు మధ్య దాదాపు 5 వేలమంది రిటైర్ కాబోతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4 లక్షలమంది ఉద్యోగులున్నారు. అలాగే కేసీయార్ గనుక రిటైర్మెంట్ వయోపరిమితి పెంచితే వీళ్ళందరికీ ఎక్స్ టెన్షన్ వస్తుందనటంలో సందేహం లేదు. అయితే పెంచే వయోపరిమితి రెండేళ్ళా లేకపోతే మూడేళ్ళా అన్నదే తేలటం లేదు. ఇదిలావుంటే ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిదేమో ఇప్పటికే అంటే ఆరుమాసాలలోపు రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటాడా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి.

ఇక రెండో సమస్య ఏమిటంటే ఉద్యోగుల వయోపరిమితి పెంచుకుంటు వెళితే మరి నిరుద్యోగుల పరిస్ధితేమిటి ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. గడచిన ఆరేళ్ళల్లో కేసీయార్ ప్రభుత్వ పరంగా నియామకాలే చేయలేదు. పైగా వివిధ విభాగాల్లో సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. ఇటు ఉద్యోగాలూ భర్తీ చేయకుండా అటు రిటైర్మెంటు వయోపరిమితిని పెంచేస్తే నిరుద్యోగులు ఎలా రెస్పాండ్ అవుతారో అని ప్రభుత్వంలో టెన్షన్ పెంచేస్తోందని సమాచారం. మరి చూడాలి కేసీయార్ చెప్పబోయే తీపికబురు ఎలాగుంటుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి