iDreamPost

మాజీ టెలికాం మంత్రికే టోకరా.. ఖాతా నుండి రూ. లక్ష మాయం

మాజీ టెలికాం మంత్రికే టోకరా.. ఖాతా నుండి రూ. లక్ష మాయం

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. అందివచ్చిన టెక్నాలజీతో కేవలం ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు కాజేస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు సైబర్ నేరగాళ్ల వలలో పడి విలవిలలాడుతున్నారు. ఒక్క నిమిషంలో ఖాతాలో ఉన్న డబ్బులు చాక చక్యంగా కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కాం వలకు ఎంపీ, మాజీ టెలికాం మంత్రి కూడా చిక్కారు. ఏకంగా ఆయన్నే బురిడీ కొట్టించి లక్ష కాజేశారు కేటుగాళ్లు. ఇంతకు ఆ మంత్రి ఎవరంటే.. డీఎంకే నేత, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్. ఆయన భార్య ప్రియా మారన్‌కు ఆగంతకుల నుండి ఫోన్ కాల్ రాగా, ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా సరే.. ఆయన ఖాతా నుండి రూ. లక్ష మాయం చేశారు కేటుగాళ్లు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 8న దయానిధి మారన్‌ భార్య ప్రియాకు  సైబర్ కేటుగాళ్ల నుండి ఫోన్ కాల్ రాగా, లిఫ్ట్ చేసి మాట్లాడారు. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి, వివరాలు తెలపాలంటూ కోరారు. అయితే ఆమె ఎటువంటి వివరాలు.. వారికి చెప్పనప్పటికీ.. వీరి జాయింట్ ఖాతా నుండి 99,999 రూపాయలు డెబిట్ అయినట్లు గుర్తించారు మారన్. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎటువంటి వివరాలు  చెప్పలేదని, అలాగే ఆ జాయింట్ ఖాతాకు ప్రియా నంబర్ లింక్ కాలేదని చెప్పారు. ప్రియాకు ఫోన్ చేసి హిందీలో సైబర్ నేరగాళ్లు మాట్లాడుతుంటే.. దయానిధిని సంప్రదించాలని కోరినట్లు పేర్కొన్నారు.

అలా మూడు సార్లు కాల్స్ వచ్చాక డబ్బులు కట్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్రంలో ఐటి, టెలికాం శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి విదితమే. ఐటీ, టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మాజీ టెలికాం మంత్రికే టోకరా వేశారంటే.. ఈ కేటుగాళ్లు ఎంత తెలివి మీరిపోయారో అర్థమౌతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి