iDreamPost

ఆన్‌లైన్‌ నామినేషన్లు.. అర్థం ఉందా..నిమ్మగడ్డ..?

ఆన్‌లైన్‌ నామినేషన్లు.. అర్థం ఉందా..నిమ్మగడ్డ..?

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు వేసేలా ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..? నా వద్దకు వచ్చి వివరణ ఇవ్వండి… ఇదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారశైలిలో చోటు చేసుకున్న తాజా పరిణామం. ప్రతిపక్ష పార్టీలు ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు అవకాశం ఇవ్వాలని కోరగానే.. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలిచ్చేశారు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు దాఖలుకు ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షాలు అడగడమే తరువాయి అందులో సాధ్యాసాధ్యాలు, సవాళ్లు, సమయంతో సంబంధం లేకుండా అమలుకు ఆదేశాలు ఇవ్వడమే నిమ్మగడ్డ పనిగా పెట్టుకున్నారు. పైగా తన ఆదేశాలు అమలు చేయలేదనే కారణం చూపుతూ చర్యలకు సిద్ధమవడం విడ్డూరంగా తోస్తోంది.

సమస్యలు.. సవాళ్లతో పని లేదా..?

ఆన్‌లైన్‌లో నామినేషన్లు అంటే ఆదేశాలిచ్చినంత సులువు కాదు. అందుకు వెబ్‌సైట్‌ రూపాందించాలి. హ్యాక్‌కు గురికాని సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించాలి. సాంకేతికపరమైన అనేక సమస్యలు తలెత్తుతాయి. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన వెబ్‌సైట్‌పై, ముఖ్యంగా రాజకీయ పరమైన అంశాలకు సంబంధించిన అంశంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా, సమస్య తలెత్తినా అనవసరమైన వివాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇందుకు సమయం అవసరం. హడావుడిగా చేసేది కాదు. ఇవన్నీ పట్టించుకోని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ప్రతిపక్ష టీడీపీ అడగ్గానే.. వెంటనే ఆన్‌లైన్‌ నామినేషన్లకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలివ్వడం విచిత్రంగా ఉంది.

రెండు నాల్కల ధోరణి..

నామినేషన్ల వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రెండు నాల్కలతో వ్యవహరిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఓ వైపు ఆన్‌లైన్‌ నామినేషన్లకు ఏర్పాట్లు చేయలేదంటూ పంచాయతీ రాజ్‌ అధికారులపై ఫైర్‌ అవుతున్న నిమ్మగడ్డ.. అదే సమయంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారనేది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ. దీన్ని కారణంగా చూపుతూ నామినేషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. కానీ వాస్తవంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. తొలి దశలో 3, 249 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 22,191 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే ఒక పంచాయతీ సర్పంచ్‌ పదవికి సరాసరి ఏడుకన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,249 పంచాయతీలకు గాను కేవలం 93 పంచాయతీలలో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. గణాంకాలు, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, డిమాండ్లకు అర్థం ఏముంది..? వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సహా చూసిన తర్వాత కూడా ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎందుకు ఏర్పాటు చేయలేదో తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ నిమ్మగడ్డ పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గరిజా శంకర్లను ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది.

అది ఎస్‌ఈసీ బాధ్యత కాదా..?

ఎన్నికలు జరుగుతున్న సమయంలో సర్వం తానే అనేలా వ్యవహరిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. నోటిఫికేషన్‌ విడుదల చేసి మిన్నుకుంటారా..? నామినేషన్ల దాఖలకు, పోలింగ్‌కు స్వేచ్ఛాయుత వాతావారణం కల్పించే బాధ్యత లేదా..? స్థానిక పోరులో చిన్నా చితకా ఘటనలు సర్వసాధారణం. గతంలోనూ చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు సొంత గ్రామంలో తమకు వ్యతిరేకంగా వైసీపీ మద్ధతుతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలుకు యత్నించిన కింజారపు అప్పన్నను అచ్చెం నాయుడు సోదరుడు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. వాస్తవ పరిస్థితిని విస్మరించి ప్రతిపక్ష పార్టీ అడగ్గానే.. ఆన్‌లైన్‌ నామినేషన్లకు ఆదేశాలిస్తే.. పోలింగ్‌ రోజు అధికార పార్టీ ఓటర్లను ఓటు వేయనీకుండా అడ్డుకుంటుందని, ఆన్‌లైన్‌లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రతిపక్ష పార్టీ అడిగితే.. దాన్ని కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అమలు చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేస్తారా..?  ప్రతిపక్ష పార్టీ వేసే తాళానికి తగ్గట్లు ఆడుతూ.. మళ్లీ తనను విమర్శిస్తున్నారు, రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారంటూ వాపోవడంలో తర్కం లేదు.

Read Also : వందకు కొట్టు.. ఇక చరిత్ర..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి