iDreamPost

బిహార్ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్.. బిజెపి కి ఆశాభంగం తప్పదా..?

బిహార్ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్.. బిజెపి కి ఆశాభంగం తప్పదా..?

బీహార్ లో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షం డిమాండ్ కు అధికార పక్షంలోని ఒక పార్టీ మద్దతు ఇచ్చింది. దీంతో అధికార పక్షంలో ఉన్న భిన్నాభిప్రాయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈ పరిణామం తలనొప్పుగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితిరాలన్న బిజెపి లక్ష్యానికి విరుద్ధంగా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఎల్‌జెపి వైఖరి ఉంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎన్డీఎ భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపి చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బిజెపి సీనియర్‌ నాయకుడు సంజయ్‌ పాశ్వాన్‌, చిరాగ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్‌జెపి నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు.

సంజయ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా, లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎల్‌జెపి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బీహార్ లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అంతేకాక ‘’కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’’అంటూ ఆయన పేర్కొన్నారు.

అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) అధికార జెడియు అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘’సుపరిపాలన’’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని, జాతీయ వేదికపై బీహార్‌కు ‘’తగిన గౌరవం’’ పొందడానికి సహాయ పడుతుందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఆర్జేడి అగ్గిరాజేసింది. అందులో అధికార భాగస్వామ్య పార్టీల మధ్య మాటల యుద్ధం‌ నడుస్తుంది. జెడియు, బిజెపి ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత ‌వ్యక్తం చేస్తున్నాయి. మరో అధికార ఎల్‌జెపి మాత్రం విముఖత వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) ఏ నిర్ణయం తీసుకుంటుందో‌ చూడాలి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి