iDreamPost

“బుట్టబొమ్మ” సాంగ్‌కు భార్యతో కలిసి చిందేసిన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

“బుట్టబొమ్మ” సాంగ్‌కు భార్యతో కలిసి చిందేసిన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

ఐపీఎల్ పుణ్యమా అని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్,ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు బాగానే ఒంట పట్టించుకున్నట్లు ఉంది. తాజాగా ఒక పాపులర్ తెలుగు సినిమా పాటకు భార్యతో కలిసి వార్నర్‌ చేసిన టిక్‌టాక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లాక్‌డౌన్‌ కాలంలో సరదాగా భార్య, కూతురులతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం హ్యాబిట్‌గా మార్చుకున్నాడు.
కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్,పూజా హెగ్డే నటించిన ‘అల…వైకుంఠపురములో’’ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని సూపర్‌ హిట్టయిన “బుట్ట బొమ్మ…బుట్ట బొమ్మ” సాంగ్‌కు భార్య క్యాండిస్‌తో కలిసి వార్నర్‌ డ్యాన్స్ చేశాడు.

బుట్టబొమ్మ పాటకు వార్నర్‌ దంపతులు సిగ్నేచర్ స్టెప్‌ వేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల ఉండి తనకు తోచిన స్టెప్పుతో అలరించింది. వీడియోలో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జెర్సీ ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వీడియోను ఇవాళ వార్నర్ భార్య క్యాండిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ఇండి మొత్తం షోను దొంగిలించిందని’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వార్నర్‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌ సీజన్‌ సమయములో ఎక్కువగా హైదరాబాద్‌లో గడుతున్న వార్నర్‌ తెలుగు వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు.తన ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అభిమానులను అలరించడం కోసం “బుట్టబొమ్మ” సాంగ్‌కు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.కాగా ఈ వీడియోపై స్పందించిన అల్లు అర్జున్ తన పాటకి డ్యాన్స్ చేసినందుకు ‘‘థాంక్యూ’’ అంటూ కామెంట్ చేశాడు.