iDreamPost

వారికి తెలంగాణ సర్కార్‌ భారీ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

  • Published Oct 02, 2023 | 10:45 AMUpdated Oct 02, 2023 | 10:45 AM
  • Published Oct 02, 2023 | 10:45 AMUpdated Oct 02, 2023 | 10:45 AM
వారికి తెలంగాణ సర్కార్‌ భారీ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అయితే.. జనాల మీద వరాల జల్లు కురిపిస్తోంది. ఎన్నికల వేళ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా.. అందరిని సంతృప్తిపరిచేలా పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల అభివృద్ధి కోసం వారికి నేరుగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసే దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి విడతంలో భాగంగా కొందరికి ఇప్పటికే ఆర్థిక సాయం అందించగా.. నేడు దళితబంధు రెండో విడత పంపిణీకి సర్కార్‌ సిద్ధమైంది.

ఇప్పటికే రెండో విడతలో భాగంగా అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేయాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో 50 వేల దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఆమోదం పొందిన అర్హుల జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు పంపేందుకు అధికారులు రెడీ అయ్యారు.

అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా దళితబంధు రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా చెక్కులను అందిచనున్నారు. అయితే తొలి విడత దళితబంధు పంపిణీలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దళితబంధు మొత్తం నుంచి భారీగా కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయం కాస్త కేసీఆర్‌ దృష్టికి చేరడంతో.. ఆయన వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాంటి అవకతవకలు చోటు చేసుకుకోకుండా.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

2021లో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు తీసుకొచ్చారు. తొలివిడతలో భాగంగా.. సుమారు 38, 323 కుటుంబాలకు నిధులు మంజూరు చేశారు. అందు కోసం రూ.4,441.80 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇక నేడు ప్రారంభించబోయే రెండోవిడత దళితబంధు పంపిణీ సందర్భంగా.. హుజూరాబాద్‌ మినహా ప్రతి నియోజకవర్గం నుంచి 1100 మంది చొప్పున ఎంపిక చేసి.. మొత్తం 1,30,000 కుటుంబాలకు పథకం అమలు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం 72 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలుకాగా.. మిగిలిన నియోకవర్గాల్లోనూ త్వరలో ప్రారంభం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి