iDreamPost

పెళ్లికి నిరాకరించిందని ప్రేయసి గొంతు కోసిన ప్రియుడు

పెళ్లికి నిరాకరించిందని ప్రేయసి గొంతు కోసిన ప్రియుడు

చదువుకుని, భవిష్యత్తులో తమ కలలను సాకారం చేస్తాడనుకుంటున్న కొడుకు.. యవ్వన దశకు వచ్చే సరికి ప్రేమ, పెళ్లి అంటూ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. పోకిరిలా మారి తన ప్రేమను కాదన్న యువతిపై అఘాయిత్యాలకు దిగుతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్‌బి‌నగర్‌లో చోటుచేసుకున్న సంఘటన ఇటువంటిదే. తనను దూరం పెట్టడంతో పాటు పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలు సంఘవిపై దాడి చేశాడు ప్రియుడు శివ కుమార్. ఆమెను తీవ్రంగా కొడుతుండగా.. అంతలో అడ్డువచ్చిన సోదరుడు పృధ్వీని శివ కత్తితో పొడవడంతో రక్తమోడి చనిపోయిన సంగతి విదితమే. ఈ దారుణ ఘటన మర్చిపోక ముందే ఇదే తరహా సంఘటన మరొకటికి వెలుగులోకి వచ్చింది. తనతో పెళ్లికి అంగీకరించడం లేదన్న అక్కసుతో ప్రేయసిపై బ్లేడుతో దాడి చేశాడు మరో ప్రేమోన్మాది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం 59వ వార్డు నెహ్రునగర్ ప్రాంతంలో లలితశ్రీ కుటుంబం నివాసముంటుంది. ఆమె ఇంటికి సమీపాన రామారావు అనే వ్యక్తి ఉంటున్నాడు. లలిత, రామారావు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. రామారావు ఏ పని చేయకపోవడంతో.. ఏదైనా పనిచూసుకోవాలని లలిత చెబుతూ ఉండేది. అయితే ఆమె మాటలు పట్టించుకోకుండా అతడు జులాయిగా తిరుగుతుండేవాడు. అయితే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఆమెను సతాయిస్తూ ఉండేవాడు. ఇంట్లో తన లవ్ మ్యాటర్ చెబితే.. తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అన్న సందేహంలో ఉండపోయేది లలిత. దీనికి తోడు అతడికి ఉద్యోగం కూడా లేకపోవడంతో తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పేందుకు వెనకాడింది. దీంతో రామారావు ఒత్తిడి తెస్తుంటే ఆమె ఏం తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది.

ఇలాగే ఉంటే పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది లలిత. అతడికి కొంత కాలంగా దూరంగా ఉంటోంది లలిత. అయితే సోమవారం రాత్రి భోజనం చేసిన లలిత మేడపై వాకింగ్ చేస్తుండగా.. రామారావు ఆమె వద్దకు వెళ్లాడు. మరోసారి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన చేశాడు. ఆమె ససేమీరా అనడంతో.. కోపంతో ఊగిపోయిన రామారావు.. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో చంపేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ అంగీకరించకపోవడంతో ఆమె గొంతుపై బ్లేడుతో కోశాడు. అనంతరం తన గొంతు కూడా కోసుకున్నాడు. దీంతో రక్తస్రావమైన యువతి.. కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని లలితను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడిని పాల్పడిన రామారావును అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి