iDreamPost

ఎల్బీనగర్ హత్య కేసు: శివను చంపేయాలని తల్లి, మేనత్త డిమాండ్

ఎల్బీనగర్ హత్య కేసు: శివను చంపేయాలని తల్లి, మేనత్త డిమాండ్

తన ప్రేమను అంగీకరించకపోవడంతో పాటు తనను దూరం పెట్టడం, పెళ్లికి ఒప్పుకోలేదన్న అక్కసుతో తన చిన్ననాటి స్నేహితురాల్ని దారుణంగా చితక్కొట్టి, అడ్డువచ్చిన సోదరుడ్ని హత్యచేశాడో కిరాతకుడు. ఎల్బీనగర్‌లో చోటుచేసుకున్న హత్య కేసులో ప్రేమోన్మాది శివకుమార్ చేసిన దాడిలో ప్రియురాలు సంఘవి తీవ్రంగా గాయపడగా.. ఆమె సోదరుడు పృధ్వీ మరణించిన సంగతి విదితమే. దీంతో సంఘవి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాఖీ పండుగ రోజున స్వస్థలానికి వెళ్లి.. తిరిగి హైదరాబాద్ వచ్చిన పిల్లలు ఇలా అయ్యారనే వార్త వినపడే సరికి ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగి తేలుతుంది. కాగా, వారి స్వస్థలం షాద్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నేరస్థుడు శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..?

తల్లి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్ గౌడ్, ఇందిర దంపతులకు కుమార్తె సంఘవి, పృధ్వీ(చింటు), రోహిత్ కుమారులు ఉన్నారు. కాగా, సంఘవి, పృధ్వీలు ఇద్దరూ చిన్నప్పటి నుండి.. పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారు. పృధ్వీ ఇంటర్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. సంఘవి ప్రస్తుతం రామాంతపూర్‌లోని హోమియోపతి కోర్సు నాలుగో ఏడాది చదువుతుంది. పృధ్వీ ఉద్యోగాల వేటలో ఉన్నాడు. తన చదువుల నిమిత్తం ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో తన సోదరుడు పృధ్వీతో కలిసి ఉంటుంది సంఘవి. కాగా, రంగారెడ్డి జిల్లాలోని నేరెళ్ల చెరువు ప్రాంతానికి చెందిన నిందితుడు శివకుమార్.. సంఘవికి పదోతరగతిలో క్లాస్ మేట్. ఇటీవల గెట్ టు గెదర్‌లో వీరంతా కలిశారని, అప్పుడు ఫోన్ నంబర్లు తీసుకున్నారని, అప్పటి నుండి సంఘవిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని శివ వేధించడం మొదలు పెట్టాడని తల్లి వెల్లడించారు.  ఆమె నిరాకరించడంతో ఇంటికి వచ్చి సంఘవిని కొట్టి, పృధ్వీని కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. తమ పిల్లలు అద్దెకు ఉంటున్న చోట ఎప్పుడూ గొడవపడలేదని అన్నారు. పిల్లలిద్దరూ కలిసే జీవించారని, ఇప్పుడు తన కొడుకును దారుణంగా చంపాడని, శివను కూడా అలా చంపేయాలని తల్లి డిమాండ్ చేశారు. వాడిని కఠినంగా శిక్షించాలని, వాడు ఈ భూమ్మీద బ్రతకకూడదని అన్నారు.

శివ బయటకు వస్తే తమ పిల్లకు ప్రాణ హాని ఉందని సంఘవి మేనత్త కన్నీటి పర్యంతం అయ్యారు. అతడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. లేదంటే అతడిని తమకు అప్పగించాలని, అతడ్ని మేమే చంపేస్తామంటూ పేర్కొన్నారు. ఆ పిల్లలు మంచి టాలెంటర్స్ అని, ఎవ్వరితో వారికి గొడవలు లేవని, ఇంట్లో ఉన్నవాళ్లను చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కత్తిపోట్లు కారణంగా పృధ్వీని బతికించుకోలేకపోయామన్నారు. పృధ్వీని అందరూ మెచ్చుకునే వారని, తాము ఇంటికి వస్తే.. తమతోనే ఉండేవాడని మేనత్త తెలిపారు. పృధ్వీ లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. శివ బయటకు వస్తే మా పిల్లను చంపేస్తాడని అన్నారు. ఏ ఆడపిల్ల ఇలా కాకుండా, వేరే తల్లిదండ్రులు ఇలా బాధపడకుండా.. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.‘శివ ఇంట్లోకి రాగానే..సంఘవి జుట్టుపట్టుకుని..బాగా కొట్టాడు. నిన్ను(శివ) పెళ్లి చేసుకుంటా అనేంత వరకు సంఘవిని గోడకేసి కొడతూనే ఉన్నాడు. ఆ అరుపులకు ఇంట్లో ఫోన్ చూసుకుంటున్న పృధ్వీ వచ్చి చూసి..అడ్డుపడగా.. తన చేతిలో ఉన్న కత్తితో పొడిచేశాడు’ అంటూ మేనత్త కన్నీరుమున్నీరు అయ్యారు. అటువంటి వాడిని చంపేయాలంటూ డిమాండ్  చేశారు. ప్రస్తుతం సంఘవి కోలుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి