Krishna Kowshik
Krishna Kowshik
యువతకు బైక్ అన్నా, వాటితో స్టంట్స్ చేయాలన్న యమ క్రేజ్. దీంతో బైకులపై ఇష్టమొచ్చినట్లు స్కిట్టులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రాణాలను సైతం బలితీసుకుంటారు. చేతిలో బండి ఉందంటే చాలు ఖాళీ ఉన్న రోడ్ల మీదే కాదూ.. ట్రాఫిక్‌లో సైతం రయ్ రయ్ అంటూ దూసుకెళుతుంటారు. బైక్ చక్రాలను పైకి లేపుతూ ఫీట్లు చేస్తుంటారు. ఇలా చేస్తున్న సమయంలో బైకు అదుపు తప్పి.. ఆసుపత్రి పాలు అవుతుంటారు. రేసులు, స్టంట్స్ చేసే సమయంలో ఇతర వాహనాలను, అటుగా వెళ్లేవారిని గాయపరుస్తుంటారు. అయితే సరదా కోసం చేసే ఈ పనుల వల్ల అమాయకుల జీవితాలు బలౌతున్నాయి. చివరకు ప్రముఖుల పిల్లలు సైతం ఇటువంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
తల్లి ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ హితవు కోరుతున్న ఆమెకు కొడుకే విలన్ అయ్యాడు. ’పండిత పుత్ర పరమ శుంఠ‘ అనే పదానికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచాడు. కొడుకే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజన గూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పీఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు యాస్మిన్ తాజ్. ఆమెకు కొడుకు సయ్యద్ ఐమన్ ఉన్నాడు. అతడు జులాయిగా తిరుగుతున్నాడు. తన తల్లి ట్రాఫిక్ పోలీసు కావడంతో తనను ఎవ్వరురా ఆపేది అనుకుని.. బైక్స్‌పై ఫీట్లు చేసేవాడు. ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వార్నింగ్‌తో పాటు జరిమానా విధించి పంపేశారు. ఓ దొంగతనం కేసులో కూడా అతడు ఉన్నట్లు సమాచారం.
పోలీసులు వార్నింగ్ ఇచ్చినా బుద్దిరాలేదు అతడికి. ఇటీవల హిమ్మవు సమీపంలో బైకుపై స్టంట్స్ చేస్తుండగా.. ఉదయగిరికి చెందిన గురు స్వామి అనే వృద్ధుడిని గుద్దేశాడు. గురుస్వామి పశువులను మేపుకుని, ఇంటికి తిరిగి వెళుతుండగా.. సయ్యద్ బైక్ వీల్స్ ను పైకి లేపి స్కిట్ చేస్తుండగా.. అదుపు తప్పి ముసలాయన్ను ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ గురుస్వామిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. రక్తం పోవడంతో మరణించాడు. ఒకరి మరణానికి కారణమైన తన కుమారుడి చర్యల పట్ల తల్లి యాస్మిన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమకు న్యాయం చేయాలని గురుస్వామి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యాస్మిన్ కుమారుడు సయ్యద్ పై పోలీసు కేసు నమోదైంది.