iDreamPost

నేల విడిచి సాము చేయొద్దు కామ్రేడ్‌

నేల విడిచి సాము చేయొద్దు కామ్రేడ్‌

నేల విడిచి సాము చేయడం అనే సామెత సీపీఐకి భేషుగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటూ చెబుతున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా. మూడు రాజదానులపై జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఢిల్లీలో ఉద్యమం చేస్తామని చెబుతున్నారు ఈ సీపీఐ రథసారధి. అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట.

నిన్న అమరావతికి వచ్చిన డి. రాజా పై విధంగా మాట్లాడారు. ఉద్యమాలు చేస్తున్న వారికి మద్ధతు ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమే. ఏ పార్టీ వారైనా సరే అభినందించాల్సిందే. అయితే ఆ ఉద్యమం పూర్వా పరాలు, డిమాండ్లుపై పూర్తి అవగాహన తెచ్చుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా, లేదా రాజకీయ నాయకుడికైనా చాలా ముఖ్యం. రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రంలో ఒక ప్రాంతానిదో, లేక చంద్రబాబు చెబుతున్నట్లు తన కలో కాదు. అది అందరిదీ. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలు సమతుల అభివృద్ధి చెందాలని జగన్‌ సర్కార్‌ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిందన్న విషయం డి.రాజాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చెప్పి ఉండకపోవచ్చు. కనీసం ఇప్పటికైనా డి. రాజా తెలుసుకోవడం మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానలతు ఎలా ఉన్నాయో కమ్యూనిస్టు వీరులకు తెలియంది కాదు. రాయలసీమ వాసైనా రామకృష్ణ తన ప్రాంతానికి, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియకపోదు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాలో ప్రజలు ఎలాంటి దుర్భర జీవితం గడుపుతున్నారో సీపీఐ రామకృష్ణ.. డి.రాజాకు చెబితే బాగుటుంది.

రాజధాని ఉద్యమానికి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ ఒకేరకమైన మద్ధతు లేదు. నాలుగైదు గ్రామాల్లోనే గత రెండు నెలలుగా ఉద్యమం సాగుతోందని మీడియాలో వచ్చే వార్తలు తెలుపుతున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి కూడా మద్ధతు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కమ్యూనిస్టు యోధులు పోరాటాలు చేస్తే పూర్వవైభవం వస్తుంది గానీ ఏదో ఒక పార్టీ నీడన పోదామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా సీపీఐ పరిస్థితి తయారవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ, సీపీఎంలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. విభజన తర్వాత ఏపీలో రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం లేదు.

గతంలో చేసినట్లు ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, పంట గిట్టుబాటు ధరలు, పంట నష్టాలకు పరిహారం కోసం, కార్మికులు కష్టాలపై పోరాటాలు చేస్తే బలం పెరుగుతుంది. ఉనికి నిలబడుతుంది. ఇలా కాకుండా నేల విడిచి సాము చేసే ప్రకటనలు చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి