iDreamPost

Tdp kesineni nani – కేశినేని నాని చేతికి ఎక్స్అఫీషియో అస్త్రం.. అయినా సరే టెన్షన్ టెన్షన్

  • Updated - 10:34 PM, Fri - 11 March 22
Tdp kesineni nani – కేశినేని నాని చేతికి ఎక్స్అఫీషియో అస్త్రం.. అయినా సరే టెన్షన్ టెన్షన్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక చర్చనీయాంశమవుతోంది. మొన్న జరిగిన కొన్ని మున్సిపల్ ఎన్నికలు, నగర పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం దర్శి మున్సిపాలిటీని ఒక్క దానిని చేజిక్కించుకోగలిగింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ విషయంలో కూడా పోటా పోటీగా జరిగింది. ఇక్కడ మొత్తం 29 వార్డులు ఉండగా అందులో 14వ వార్డులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 14వ వార్డులు అధికార వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక వార్డ్ లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి గెలుపొందిన తర్వాత చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా అయితే కప్పుకున్నారు. కానీ లోకల్ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇద్దరూ కూడా తమ పార్టీ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నిక అయేలా చూడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైందని ఎవరైతే పక్క చూపులు చూస్తున్నారో వారిని ఆకర్షించే పనిలో ఇతర పార్టీల వారు పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు అప్లై చేసుకోవడం తో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులు అందరినీ రహస్య ప్రాంతాలకు తరలించాయి. కేవలం చైర్మన్ అభ్యర్థుల ఫోన్ లు మాత్రమే పనిచేస్తున్నాయి.

ఇప్పుడు ఛైర్మన్‌ పీఠాన్ని సొంతం చేసుకొనే అంశం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ రెబెల్ అభ్యర్థి అండతో టీడీపీ ఆ పీఠాన్ని కైవసం చేసుకొంటుందా..? లేక అధికారంలో ఉంది కాబట్టి ఒకరిద్దరు అభ్యర్థులు తమ తమ వార్డుల అభివృద్ధి కోసం వైసీపీలో చేరితే ఆ పార్టీ కైవసం చేసుకుంటుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు చాలా కీలకంగా మారడంతో కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో ఓటును వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎంపీ కేశినేని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత కూడా ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం నాడు ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ఈ మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం అయితే కనుక మొత్తం మీద మూడు మున్సిపాలిటీలకు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లభించినట్లు అవుతుంది. ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉండగా మొన్న జరిగిన ఎన్నికల్లో దర్శి ఇప్పుడు కొండపల్లి కూడా ఆ పార్టీకి లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ఈ అంశం మీద ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Kesineni Nani, Kondapalli Municipality – ఉమా ఇలాకాలో చక్రం తిప్పిన కేశినేని