iDreamPost

25 రోజుల్లో 45 వేలమంది చనిపోయారు.. చరిత్రలో పీడకలేనా ?

25 రోజుల్లో 45 వేలమంది చనిపోయారు.. చరిత్రలో  పీడకలేనా ?

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో 50 వేలమంది చనిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఏప్రిల్ నెల 25 రోజుల్లోనే 46 వేలమంది మృతి చెందటం సంచలనంగా మారింది. గడచిన 55 రోజుల్లో దేశం మొత్తం మీద సుమారు 9 లక్షల మంది బాధితులు నమోదయ్యారు. బాధితుల్లో కానీ చనిపోయిన వారిలో కానీ న్యూయార్క్ రాష్ట్రందే అగ్రస్ధానం. తర్వాత న్యూజెర్సీ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

మొత్తం మీద వైరస్ అమెరికాను వణికించేస్తోంది. పది రోజుల క్రితం బాగా ఉధృతంగా ఉన్న కేసులు, మరణాల సంఖ్య తర్వాత ఓ ఐదురోజులు తగ్గింది. ఎప్పుడైతే ఐదురోజులు కేసుల సంఖ్య తగ్గిందో అమెరికా ఊపిరిపీల్చుకుంది. కానీ మళ్ళీ ఒక్కసారిగా తీవ్రత పెరిగిపోయింది. అత్యధికంగా 4653 మంది చనిపోవటంలో అగ్రరాజ్యం అతలాకుతలం అయిపోయింది.

ఫిబ్రవరి 29న అమెరికాలో వైరస్ వల్ల తొలి మరణం నమోదైంది. మార్చి మొత్తం మీద అమెరికాలో మరణించిన వారి సంఖ్య 5151 అయితే ఒక్క ఏప్రిల్ లో ఇప్పటి వరకు చనిపోయిన వారిసంఖ్య 46 వేలు కావటం గమనార్హం. అంటే ఉత్పాతాల చరిత్రలో అమెరికాలో 2020, ఏప్రిల్ నెల చరిత్రలో నిలిచిపోవటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. వైరస్ దెబ్బకు ఆర్ధికవ్యవస్ధ మొత్తం కుప్పకూలిపోయింది. దాంతో అనేకరంగాలు మూతపడిపోయాయి. దాంతో ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య 4 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇంత భయంకరమైన పరిస్ధితుల్లో కూడా సంతోషకర వార్త ఏమిటంటే క్షేత్రస్ధాయిలో అమెరికాలోని చాలా కౌంటీల్లో కేసుల తీవ్రత తగ్గుతోందట. 23 రాష్ట్రాల్లో కేసుల తీవ్రత తగ్గుతోందని అలాగే అనేక కేసుల్లో 40 శాతం కేసుల నమోదు భారీగా తగ్గిపోయిందని 46 రాష్ట్రాల నుండి నివేదికలు అందుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ చెప్పటం సంతోషమే. ఏదేమైనా కరోనా వైరస్ అన్నది అమెరికా చరిత్రలో పీడకలగా నిలిచిపోవటం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి