iDreamPost

అమెరికా అధ్యక్ష భవనంలో కరోనా … వణికిపోతున్న వైట్ హౌస్

అమెరికా అధ్యక్ష భవనంలో కరోనా … వణికిపోతున్న వైట్ హౌస్

భూ మండలం మీద భూమ్మీద అత్యంత శక్తిమంతమైన, శత్రుదుర్భేద్యమైన చోటు.. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలవబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని సైతం కరోనా మహమ్మారి తాకింది. తాజాగా వైట్‌హౌస్ లో కరోనా కలకలం రేగింది. ట్రంప్, ఆయన కుటుంబం, ఫెడరల్ ప్రభుత్వ కీలక మంత్రులు, అధికారులు నిత్యం వచ్చిపోయే చోటే వైరస్ వెలుగుచూడటం ఇప్పుడు సంచలనంగా మారింది.

వైట్ హౌస్ లోని ఓ కీలక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు సాక్ష్యాత్తూ వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి క్యాథీ మిల్లర్ మీడియాకు వెల్లడించారు. అదికూడా అమెరికాలో కరోనా పరస్థితి సమీక్షిస్తున్న ఆదేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని వ్యక్తికి అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వైట్ హౌస్ అధికారులు ఈమధ్య అతనిని కలిసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోనూ కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో కొద్దిరోజుల క్రితమే ట్రంప్ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ గా వచ్చింది. అంతకుముందు ట్రంప్ ని కలిసిన పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో ట్రంప్ కి టెస్ట్ చేయక తప్పలేదు. దీంతో అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది లోపలికి వచ్చేవారిని తనిఖీ చేస్తున్నారు.

డబ్ల్యూహెచ్ఓ సూచించిన మేరకు సామాజిక దూరం పాటించేలా కార్యాలయంలో సీటింగ్ ఆరేంజ్ చేసారు. అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 230కి చేరింది. అలాగే రెండ్రోజుల్లోనే 10 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటింది. న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ ప్రజారవాణాపై కఠిన ఆంక్షలు విధించారు.

ప్రపంచమంతా ఈ వైరస్ విస్తరించడానికి చైనానే కారణమని ట్రంప్ మరోసారి విమర్శించారు. కరోనా సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లే ప్రపంచమంతా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందన్నారు. కరోనాపై కొద్దినెలలు ముందు సమాచారం ఉండి ఉంటే బాగుండేదని చైనాలో పుట్టుకొచ్చిన ప్రాంతానికే ఆ వైరస్ ను పరిమిటం చేసేవాళ్లమన్నారు. ఇది చైనాకు సరైన పద్ధతి కాదని చైనా తీరును ట్రంప్‌ తప్పుపట్టారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించలేదు.

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా మొత్తం 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2లక్షల 75వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7వేల 479 మంది పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటివరకూ 11వేల 385మంది చనిపోయారు. 90 వేల 943 మంది నుంచి కోలుకున్నారు. ఈ వైరస్ వెలుగు చూసిన చైనాలో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. కరోనా బారినపడి ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 11వేలకు దాటడం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి