iDreamPost

సిక్కోలులో కరోనా కలకలం

సిక్కోలులో కరోనా కలకలం

మూడు పాజిటివ్ కేసులు నమోదు

ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కరాల నృత్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న కరోనా ఇంకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోకి రాలేదు అనుకున్నా ఇప్పుడు ఇక్కడా దాని ఉనికి బయటపడింది. శనివారం శ్రీకాకుళంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, వారి కుమార్తెకు కరోనా సోకినట్లు రిపోర్ట్ రావడంతో జిల్లా వాసుల్లో కలవరం మొదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. శనివారం కొత్తగా 61 కేసులు నమోదుకాగా.. 31మంది చనిపోయారు. కానీ శనివారం బులిటెన్‌లో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి పాజిటివ్ తేలింది.

ఢిల్లీలో పనిచేసే వ్యక్తి తన సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లాకు మార్చిలో వచ్చాడు. ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కానీ నాలుగైదు రోజుల క్రితం అతడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే అతడి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. విచిత్రంగా అతడికి నెగిటివ్ రాగా.. అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. దీంతో వారికి సన్నిహితంగా ఉన్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని క్వారంటైన్‌కు తరలించారు..

అయితే ఆ కరోనా క్యారియర్ గా చెబుతున్న వ్యక్తి తబ్లీగ్ జమాత్‌ సమావేశానికి హాజరైన వారితో కలిసి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. సొంత ఊరికి రాగానే హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. ఆ వ్యక్తికి ముందు ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్‌లో మరోసారి పరీక్షించారు.. ఆ శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపించగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగిటివ్ రాగా విచిత్రంగా అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ తేలింది. రాష్ట్రములో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోగా విజయనగరం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి