iDreamPost

ఏపీ సీఎం జగన్‌కు కరోనా నెగిటివ్

ఏపీ సీఎం జగన్‌కు కరోనా నెగిటివ్

కేవలం పదే పది నిమిషాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తేల్చిచెప్పే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ దక్షిణ కొరియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. లక్ష కిట్లు దక్షిణ కొరియా సియోల్ నుండి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి.

కాగా గతంలో ఇటీవల విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌తో కరోనా నిర్థారణ 50 నిమిషాల్లో పూర్తి అయ్యేది. కానీ దక్షిణ కొరియా నుండి వచ్చిన కిట్లతో కేవలం పది నిమిషాల్లో వైరస్ ఉందొ లేదో నిర్దారించవచ్చు. దీంతో తక్కువ సమయంలో మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించవచ్చని, మరో పది లక్షల కిట్లను రాష్ట్రానికి రప్పించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో జిల్లాలన్నింటికీ ఈ కిట్లను పంపిస్తామని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబ సర్వేలో కరోనా అనుమానిత లక్షణాలను గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని, పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని వారికి సీఎం జగన్‌ సూచించారు.

కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్

దక్షిణ కొరియా నుండి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పరిశీలించారు. తనకు కరోనా ఉందో లేదో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరగా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కేవలం పది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి జగన్ కి కరోనా నెగెటివ్ అని నిర్దారణ అయ్యింది. కరోనా టెస్టులు చేయించుకోవడానికి ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, సందేశం ఇవ్వడానికే ముఖ్యమంత్రి జగన్ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారని వైద్యులు వివరించారు.కోవిడ్‌ –19 కంట్రోల్‌సెంటర్‌లో స్టేట్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు.

గతంలో పాత కిట్ల ద్వారా రోజుకు 10000 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడానికి సాధ్యపడేదని కొత్త కిట్ల రాకతో 15000 వరకూ నిర్దారణ పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కేవలం ఒక్క రక్తపు బొట్టు ద్వారా కరోనా నిర్దారణ పరీక్ష నిర్వహిస్తారని,రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా కోవిడ్‌–19 పరీక్షల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుందని, ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా కంటైన్‌మెంట్‌ జోన్లలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ 19 కో ఆర్డినేటర్ డా. రాంబాబు వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి