iDreamPost

రాబోయే అరవై రోజులు ఎన్నికల పండగే..

రాబోయే అరవై రోజులు ఎన్నికల పండగే..

మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బుధవారం  రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో దీని మీద విధి విధానాలను అధికారికంగా ప్రకటించింది. దాదాపు సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడున్న చట్టాలతో పాటు ఎన్నికల నియమ నిబంధనలను కఠిన తరంచేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు తెలిపింది.

ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం నగదు మద్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిబంధనలను కఠినతరం చెయ్యాలని, ఎవరైనా అభ్యర్థులు నగదు పంచుతూ దొరికితే వారి అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేయాలనే కఠిన నిబంధనతో పాటు అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై అనర్హత వేటుతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించాలని రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల్లో ధనప్రభావాన్ని, ప్రలోభాలను తగ్గించి ఎన్నికలలో జరిగే అక్రమాలను అరికట్టడం కోసం నోటిఫికేషన్ వెలువడిన దగ్గరనుండి పోలింగ్ పూర్తయ్యేవరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను 10 నుండి 14 రోజుల లోపు పూర్తి చెయ్యాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లోగా, సర్పంచుల ఎన్నికలు 13 రోజులలోగా పూర్తి చేసేవిధంగా చట్టంలో మార్పు తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. పంచాయితీ ఎన్నికల అభ్యర్థుల ప్రచారానికి ఐదు రోజులు, ఎంపిటిసి అభ్యర్థుల ప్రచారానికి ఏడు రోజులు గడువు విధించింది.

ఇది ఇలా ఉండగా గతంలో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో రిజర్వేషన్లు 50% దాటడంపై బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూ, ఫిభ్రవరి 17 లోగా రిజర్వేషన్లపై ఏ విషయం తేల్చాలని హైకోర్టు ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫిభ్రవరి 17న హైకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించినా, తమ ప్రభుత్వం మాత్రం హైకోర్టు తుది తీర్పు మేరకే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్ని నాని విలేకరులకు స్పష్టం చేశారు.

ఈనేపధ్యంలో రాష్ట్రంలో రాబోయే 60 రోజుల్లో మొదట పంచాయితీ ఎన్నికలు, తరువాత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు, ఆతరువాత కొద్దీ విరామంతోనే పురపాలక సంఘం ఎన్నికలు ఇలా వరుసగా ఒకటి తరువాత ఒకటి వెంటవెంటనే జరగనున్నాయి. మార్చి 15 తరువాత శాససనసభ బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో ఆలోపే పంచాయితీ, జిల్లాపరిషత్, పురపాలక సంఘం ఎన్నికలు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది.

ఆదిశగా ఇప్పటికే పంచాయితీ, జెడ్పిటిసి, పురపాలక సంఘాల్లో ఓటర్ జాబితాలు, వార్డులు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంభందించిన అంశాలపైనే ప్రభుత్వం దృష్టి సారించే వెసులుబాటు లభించింది. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో, హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఏప్రిల్ మే నెలల్లో సహకార సంఘాల ఎన్నికలు, జూన్ నాటికి నీటి సంఘాల ఎన్నికలను పూర్తిచేసి ఆ తరువాత పూర్తి కాలాన్ని పాలనపైనే కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

ఎట్టకేలకు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో అధికార పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఆశావాహులందరూ ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కాగా ముఖ్యమంత్రి మాత్రం పార్టీ పెట్టినప్పటి నుండి జెండా మోసిన కార్యకర్తలకే ప్రధాన్యత ఇవ్వాలని మంత్రులకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలుగుదేశం క్యాడర్ లో మాత్రం పూర్తిగా నిస్తేజం నెలకొని వుంది. ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఆర్ధికంగా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం, మరో నాలుగున్నరేళ్ళ పాటు వైసిపి ప్రభుత్వమే అధికారంలో ఉండనుండడంతో, తెలుగుదేశం స్థానిక నాయకులెవరు పోటీ చెయ్యడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దానితో పార్టీ పరువు నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు స్థానిక నాయకత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఏదేమైనా అధికార పక్షానికి అనుకులంగా వుండే ఈ ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బిజెపిలలకు మాత్రం కత్తి మీద సామే అని చెప్పకతప్పదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి