iDreamPost

రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు, త్వ‌ర‌లో మ‌రో నాలుగు పోర్టులు, సీఎం జ‌గ‌న్

రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు, త్వ‌ర‌లో మ‌రో నాలుగు పోర్టులు, సీఎం జ‌గ‌న్

రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమ‌ని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బుధవారం పోర్టు శంకుస్థాపన త‌ర్వాత‌ నిర్వాసితులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

రామాయపట్నం పోర్టు రావడంతో, ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పోర్టుతో చుట్టుప్ర‌క్క‌ల ఆర్ధికాభివృద్ధి జ‌రుగుతుంద‌న్న భ‌రోసానిచ్చారు సీఎం జ‌గ‌న్.

ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. ఈ ఐదేళ్ల‌లోనే మరో 4 పోర్టులు, భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నంలు రానున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్న టన్నుల కెపాసిటీకి కూడా వస్తోంది. ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు కూడా వేగవంతంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్పలతో పాటు మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నంతో పాటు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌లు నిర్మాణం జరుపుకుంటాయ‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్.

పోర్టులకు సంబధించిన నిర్మాణపనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల్లోనే మిగిలిన పోర్టులకు కూడా భూమిపూజ జ‌ర‌గ‌నుంది.

పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, బ్యాంకులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పోర్టు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికుల‌కేన‌ని స్పష్టం చేసిన సీఎం జగన్‌, స్థానిక‌ల‌కు 75శాతం చ‌ట్టం చేసింది తామేన‌ని తెలిపారు. ఇప్పుడున్న‌ ఆరు పోర్టులకు అద‌నంగా మ‌రో నాలుగు పోర్టులు నిర్మించ‌నున్నామ‌ని, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప‌నులు వేగవంతం చేశామని అన్నారు. త్వరలోనే కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్ల‌కు భూమి పూజ చేస్తామని సీఎం జగన్ ప్ర‌క‌టించారు.

ఐదేళ్లు ఏం చేయ‌కుండా, ఎన్నికల ముందు టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు చెప్పుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన చేశామ‌ని ప్రజలను మభ్యపెట్టింది. భూ సేకరణ, డీపీఆర్ లేవు. అయినా హ‌డావిడి. కాని, తమ ప్రభుత్వం అన్ని క్లియరెన్స్‌లతో పక్కాగా ముందుకు వెళ్లోంద‌ని, ప్రజలు గమనించాలని సీఎం జగన్‌ కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి