iDreamPost

జులై 31న రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఏ ఏ అంశాలు చర్చించనున్నారంటే?

జులై 31న రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఏ ఏ అంశాలు చర్చించనున్నారంటే?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. జులై 31న సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి ప్రమాముఖ్యత సంతరించుకుంది. ఏ అంశాలపై చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వరదలు, వర్షాలు, దెబ్బతిన్న పంటలు, రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నట్లు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాలకు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించనున్నారు.

ఈ అకాల వర్షాలు పంటలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేయనున్నారు. అంతేకాకుండా అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉద్ధృతంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. రోడ్ల పునరుద్ధరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు వంటి అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి