iDreamPost

బీజేపీ చెయ్యనిది.. కేసీఆర్‌ చేయబోతున్నారు

బీజేపీ చెయ్యనిది.. కేసీఆర్‌ చేయబోతున్నారు

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే తన ఆకాంక్షను పలు సందర్భాల్లో వెలిబుచ్చుతూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఇదే సరైన సమయమని భావించిన కేసీఆర్‌ ఆ దిశగా ప్రయాణించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్న కేసీఆర్‌.. తన మూడో రోజు పర్యటనలో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, రైతు నేత తికాయత్‌లను విందుకు ఆహ్వానించి.. వారితో భేటీ అయ్యారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు.

రాజకీయపార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలతో భేటీ అవుతూనే.. జాతీయస్థాయిలో తన ఖ్యాతిని పెంచుకునేందుకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్న కేసీఆర్‌.. వాటిని అమలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత రాకేష్‌ తికాయత్‌ ఓ ముఖ్యమైన విషయం చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చనిపోయిన రైతుల వివరాలను ఈ నెల 10వ తేదీన కేసీఆర్‌కు అందిస్తానని తెలిపారు. తికాయత్‌ ఈ మాట చెప్పడంతో.. చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్‌ తరపున కేసీఆర్‌ ఆర్థికసాయం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. చనిపోయిన రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పన సాయంచేస్తామని కేసీఆర్‌ గత ఏడాది ప్రకటించారు.

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 నవంబర్‌ నుంచి 2021 నవంబర్‌ వరకు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహించారు. చలి, ఎండ, వర్షంలో జరిగిన ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతుల ఆందోళనలతో దిగివచ్చిన మోడీ సర్కార్‌ గత ఏడాది నవంబర్‌ 19వ తేదీన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, ఆ మేరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రకటన చేసే సమయంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌ వచ్చింది. రైతుసంఘాల నేతలతోపాటు, వివిధ రాజకీయపార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. సాయం అందిస్తామని ప్రకటించిన మోడీ సర్కార్‌.. మూడు నెలలు అవుతున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రైతులను మోసంచేసిన బీజేపీని యూపీ ఎన్నికల్లో శిక్షించాలంటూ ఇటీవల రైతుసంఘం నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. రెండురోజుల క్రితం వీహెచ్‌పీ మాజీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా కూడా బీజేపీ ప్రభుత్వతీరును తప్పుబట్టారు. ఆఫ్ఘనిస్థాన్‌కు 20 వేల కోట్ల రూపాయలు సాయంచేసిన ప్రభుత్వం.. చనిపోయిన మన రైతు కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వలేరా..? అంటూ ప్రశ్నించారు.

చనిపోయిన రైతు కుంటుంబాల పట్ల ఇలాంటి వైఖరిని బీజేపీ అవలంభిస్తున్న తరుణంలో.. కేసీఆర్‌ అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకురావడం దేశ వ్యాప్తంగా ఆయన ఖ్యాతిని పెంచబోతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ చేయని పనిని.. తెలంగాణ సర్కార్‌ తరపున చేయబోతున్న కేసీఆర్‌.. మోడీ సర్కార్‌ తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేయబోతున్నారు.

2020 జూన్‌ 15న గాల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. 2019 జూన్‌ 19న ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం, 19 మంది సైనికులకు పది లక్షల రూపాయల చొప్పన సాయం ప్రకటించారు. ఇప్పటికే కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సాయం అందించిన కేసీఆర్‌.. ఇతర సైనికుల కుటుంబాలకు పరిహారం అందించబోతున్నారు.

19 మందిలో బీహార్‌కు చెందినవారు ఐదుగురు, పంజాబ్‌ నుంచి నలుగురు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరందరికీ కేసీఆర్‌ స్వయంగా వెళ్లి పరిహారం ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లి అమరుల కుటుంబాలకు పరిహారం అందించబోతున్నారు. సైనికుల కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్‌ ఆయా రాష్ట్రాలలో పర్యటించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.