Dharani
Dharani
రాష్ట్రంలోని వీఆర్‌ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న కల సాకారం చేసేందుకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు సెక్రటేరియట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు. నాలుగేళ్ల సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను(జేపీఎస్) క్రమబద్దీకరించాలంటూ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని రోజుల క్రితం జేపీఎస్‌లు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. 16 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. జేపీఎస్‌ల సమ్మెతో దిగివచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జేపీఎస్‌ల పని తీరుపై జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలానే వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణకు సంబంధించి సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఆర్‌ఏ అభ్యర్థుల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు.. వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంతేకాక దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉపసంఘంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. ఈ మంత్రుల ఉపసంఘం బుధవారం (జులై 12) నుంచే వీఆర్ఏలతో చర్చలు జరపనుంది
ఉప సంఘం సూచనల ప్రకారం అధికారులు వీఆర్ఏలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆయా శాఖల్లో వీఆర్ఏల సేవలు ఉపయోగించుకోవాలంటూ సీఎం కేసీఆర్.. సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సమర్పించిన తరువాత.. దానిపై మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులు, ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలు పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ ప్రార్థనా స్థలాల ప్రారంభ తేదీలపై కూడా అధికారులతో కేసీఆర్చర్చించినట్లు తెలుస్తోంది.