iDreamPost

సీఎం జగన్‌ సంచలన ప్రకటన..! ఆ జబ్బుల వారికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు లేవట..!!

సీఎం జగన్‌ సంచలన ప్రకటన..! ఆ జబ్బుల వారికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు లేవట..!!

మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం జగన్‌.. చివరికి మాట తప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న జబ్బుల సంఖ్యను 1059 నుంచి 2059కి పెంచిన జగన్‌.. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకంలో మార్పులు చేశారు. రేషన్‌కార్డు ఉన్న వారికే కాకుండా ఏడాది ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు మార్చారు. తన తండ్రి పేరున.. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అని పేరు పెట్టారు. పథకానికి సంబంధించిన స్మార్ట్‌ కార్డులు అందించడం నేడు కర్నూలు నుంచి లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యధీమాను కల్పించిన సీఎం జగన్‌.. ఒక్క విషయంలో మాత్రం మాట తప్పారు. మాట ఎక్కడ తప్పారో.. రాష్ట్ర ప్రజలు ఈ రోజు కర్నూలు వేదికగా చూశారు. జగన్‌ మాటలు విన్నారు.

‘‘ఆరోగ్యశ్రీలో కేన్సర్‌కు చికిత్స ఉంది గానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేద’’ని సీఎం జగన్‌ చెప్పారు.

‘‘కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉందిగానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనేలేద’’ని తెలిపారు.

‘‘వయస్సు మళ్లితే చికిత్స ఉంది గానీ మెదడు కుళ్లితే మాత్రం చికిత్సలు లేనేలేవ’’ని ప్రకటించారు.

సీఎం తాజా ప్రకటనతో.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ పార్టీ అధినేతకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవడంపై ఫైర్‌ అవుతున్నాయి. ఇది ముమ్మాటికి మాట తప్పడమేనంటూ ధ్వజమెత్తుతున్నాయి. మాట తప్పను.. మడమ తిప్పను అన్న సీఎం జగన్‌.. నేడు అశేష జనం సాక్షిగా తాను పుట్టిన రాయలసీమలోనే మాట తప్పారని ఎద్దేవా చేస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 500 రకాల నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సీఎం జగన్‌ ఇటీవల చెప్పారు. అయితే అసూయతో పుట్టే కడుపు మంట, చెడు దృష్టి, కుళ్లిన మెదడు గల మనుషులను మహానుభావులుగా చూపించే టీవీ చానెళ్లు, పత్రికలు కొంత మందికి ఉన్నాయని సీఎం జగన్‌ ఈ రోజు కర్నూలులో చెప్పారు. ఇలాంటి చానెళ్లు, పత్రికల వారిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవని పరోక్షంగా ఎల్లో మీడియాకు చురకలంటించారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా ఈ రోజు కర్నూలు బహిరంగ సభలో సీఎం జగన్‌.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును, ఆయన తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా అధిపతులను తనదైన చలోక్తులతో చీల్చి చెండాడారు. ప్రభుత్వ పథకాలను ఉటంకిస్తూ.. ప్రత్యర్థులపై చేసిన విమర్శలు సూటిగా దూసుకెళ్లాయి. ఎవరెన్నీ చేసినా.. బురద జల్లినా.. తాను అనుకున్నది చేస్తానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. నిజాయతీగా పని చేస్తూ.. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో తన వైఖరిని పునరుద్ఘాటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి