iDreamPost

క‌రోనాపై స‌మ‌రంలో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో ముంద‌డుగు

క‌రోనాపై స‌మ‌రంలో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో ముంద‌డుగు

ఇప్ప‌టికే క‌రోనా నియంత్ర‌ణ‌లో దేశంలోనే మంచి కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజ‌లో ఉన్న‌ట్టు ప‌లు సర్వేలు స్ప‌ష్టం చేస్తుండ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టెలీమెడిసిన్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌జ‌లంద‌రికీ ఎటువంటి వైద్య స‌హాయం కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఒక్క ఫోన్ కాల్ దూరంలో స‌మ‌గ్ర స‌మాచారం తీర్చేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించింది. టెలీమెడిసిన్ ప్రారంభించిన సీఎం డాక్ట‌ర్ తో మాట్లాడారు.

రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు14410 కేటాయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందించ‌బోతున్నారు. కోవిడ్‌–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్‌ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం వంటి ల‌క్ష్యాల‌తో ఈ టెలీమెడిసిన్ కొన‌సాగుతుంది

అందులో భాగంగా ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు అందిస్తారు. డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెన్స్‌ టెక్నాలజీ టీం నుంచి కూడా స‌హాయం లభిస్తుంది. మూడు అంచెల్లో ఈ విధానం అమ‌లు చేస్తారు. 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే, వెంట‌నే అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌∙రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. వాటి ఆధారంగా రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

రెండోద‌శ‌లో ఆ స‌మ‌యంలో ఉన్న డాక్ట‌ర్ల బృందం నుంచి ఒక‌రు కాల్‌చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుందని తెలిపారు. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.

మూడోద‌శ‌లో కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన జ‌రుగుతుంది. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు సిద్ధం అవుతాయి. ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు. ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు. నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

ఇలా వివిధ ద‌శ‌ల్లో ప‌గ‌డ్బందీగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగించ‌డం ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు అనుగుణంగా చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే మూడు సార్లు నిర్వ‌హించిన స‌ర్వేలు కొంత ఫలితం ఇవ్వ‌గా, తాజాగా మొద‌ల‌యిన టెలీమెడిసిన్ ద్వారా క‌రోనా నియంత్ర‌ణ జ‌రుగుతుంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది. అనుమానితుల్లో ఆందోళ‌న కూడా త‌గ్గించే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి