iDreamPost

న్యాయ రాజధాని పర్యటనకు సీఎం జగన్

న్యాయ రాజధాని పర్యటనకు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు మంగళవారం కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన తర్వాత మొదటిసారి సీఎం జగన్‌ ఆ నగరానికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.

ఒక్క రోజు పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ పలు కార్యక్రమాలను కర్నూలులో ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వైద్యశాఖకు సంబంధించిన కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్యోగ్యశ్రీ పథకానికి చెందిన స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను లాంఛనంగా లబ్ధిదారులకు అందించనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా.. హెల్త్‌ సబ్‌సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. పేద ప్రజలు వైద్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే దానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా పథకంలో సమూల మార్పులు చేశారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు రాష్ట్రంలో కొత్తగా 5 వేల ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఆ కేంద్రాల నిర్మాణానికి రేపు సీఎం లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి