iDreamPost

బండారం బట్టబయలు చేసిన జగన్

బండారం బట్టబయలు చేసిన జగన్

ఏపీ శాసన మండలిపై సీఎం వైఎస్‌ జగన్‌ కుండ బద్దలు కొట్టారు. ఈ రోజు సాయంత్రం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు మండలికి అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 60 కోట్లు ఖర్చు చేస్తోంది. మండలి చేసే సూచనలను కూడా శాసన సభ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు మండలి అవసరం ఏముంది. బిల్లులను రాజకీయకోణంతో అడ్డుకోవడం తప్పా’’ అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

మండలి రద్దుకు వ్యతిరేకంగా ఈనాడు పత్రిక రాస్తున్న కథనాలపై సీఎం స్పందిస్తూ.. 1983లో మండలి రద్దును సమర్థిస్తూ అప్పట్లో రాసిన కథనాలను సభలో ప్రదర్శించారు. అప్పట్లో రామోజీరావు కోసం మండలిని రద్దు చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు తాము బేరసారాలు ఆడుతున్నట్లు కథనాలు రాస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో సహా పట్టుబడితే.. చంద్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఒక్క ముక్క రాయలేదని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను 23 మందిని చంద్రబాబు కొంటే.. చాణక్య నీతిగా చంద్రబాబును పొగిడాయంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబులా నీతిమాలిన రాజకీయాలు తాను చేయనని, అలా చేస్తే.. చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

పలు సందర్భాల్లో చంద్రబాబు మాట మార్చిన విషయాన్ని సీఎం జగన్‌ సభలో ప్రస్తావించారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు ఏ విధంగా మాట మార్చారో వీడియోలను ప్రదర్శించారు. ప్రత్యేక హోదా, నరేంద్రమోదీ, కాంగ్రెస్‌.. విషయాల్లో చంద్రబాబు ఏఏ సందర్భాల్లో ఏమేమి మాట్లాడారో ఆ వీడియోల్లో ప్రదర్శించారు. శ్రీభాగ్‌ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు చేస్తూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. ఎవరికి అన్యాయం చేసినట్లు చంద్రబాబు మాట్లాడతారని ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి