iDreamPost

ఇంటర్ విద్యార్థిని మృతి! అసలేం జరిగిందంటే?

ఇంటర్ విద్యార్థిని మృతి! అసలేం జరిగిందంటే?

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతి ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. మా కూతురుని కొందరు యువకులు అత్యాచారం చేసి ఆ తర్వాత గుండు కొట్టించి హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. అలాంటి ఆధారాలు ఏం లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్నో అనుమానాలకు తావు ఇస్తున్న ఈ కేసులో అసలేం జరిగిందంటే?

అసలేం జరిగిందంటే?

అది చిత్తూరు జిల్లా పెనమూరు పరిధిలోని వేణుగోపాలపురం గ్రామం. ఇదే ఊరికి చెందిన భవ్యశ్రీ (16) అనే బాలిక స్థానిక పట్టణంలో ఇంటర్ చదువుతోంది. ఈ బాలిక అందరితో ఎంతో చలాకీగా హుషారుగా ఉండేది. మరో విషయం ఏంటంటే? స్థానికంగా ఉండే ఓ ముగ్గురు యువకులు ఈ అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ అమ్మాయి మాత్రం వారిని పట్టించుకునేది కాదని సమచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ.. ఆ రోజు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికి బంధువులకు సమాచారం అందించారు. అయినా కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు.

ఇక వారికి ఏం చేయాలో తెలియక సెప్టెంబర్ 18న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అదే నెల 20న స్థానికంగా ఉన్న ఓ బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ అమ్మాయి జుట్టు అంతా ఊడిపోయి, కళ్లు బయటకు వచ్చాయి. కూతురిని అలా చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అనంతరం ఆమె తండ్రి స్పందిస్తూ.. మా కూతురుని గత కొంత కాలంగా ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని, వాళ్లే భవ్యశ్రీని దారుణంగా హింసించి, అత్యాచారం చేసి చంపి, గుండెకొట్టి బావిలో పడేసి ఉంటారని ఆరోపించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొందరు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు స్పందిస్తూ.. మృతురాలి శరీరం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, పరీక్షల అనంతరం అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

దీంతో పాటు సోషల్ మీడియాలో ఆ బాలికను గుండు గీసి చంపారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తేగాని ఆ బాలిక మృతికి కారణం చెప్పలేమని పోలీసులు అన్నారు. అయితే భవ్యశ్రీ మృతిపై సోషల్ మీడియలో నెటిజన్స్ స్పందిస్తూ ఆ బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని.. #JusticeForBhavyaSri అనే హ్యాష్ టాగ్ తో డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి