iDreamPost

కమర్షియల్ గేమే చిరంజీవి మంత్రం

కమర్షియల్ గేమే చిరంజీవి మంత్రం

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఏదీ చూసినా చిరు మంత్రంతో తపించిపోతున్నాయి. కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్లు, ఆచార్య మేకింగ్ వీడియోలు తదితరాల హంగామా గట్టిగానే ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోయే భోళా శంకర్ లో చెల్లిగా నటించబోయే కీర్తి సురేష్ పాత్ర తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వీడియో రూపంలో విడుదల చేసి ఇందాకే అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సాయంత్రం బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా తాలూకు ప్రకటన వచ్చేస్తే అంతా సంపూర్ణం అయిపోతుంది. మొత్తం నాలుగు అప్డేట్స్ వచ్చినట్టు.

ఇక విషయానికి వస్తే శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల కోసం ఎనిమిదేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవి తన కంబ్యాక్ కోసం కత్తి తమిళ రీమేక్ ఖైదీ నెంబర్ 150ని ఎంచుకుని మంచి పనే చేశారు. కమర్షియల్ గా అది సాధించిన సక్సెస్, చిరు రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారన్న క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. అయితే డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో చేసిన సైరా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక యావరేజ్ దగ్గర ఆగిపోయింది. అయినా వంద కోట్ల వసూళ్లు రావడం మర్చిపోకూడదు. కానీ పెట్టుబడి రాబడి లెక్కల్లో చూసుకుంటే మాత్రం సంతృప్తి కరమైన రిజల్ట్ అయితే కాదు.

సో ఫైనల్ గా చిరు ప్రయోగాలకు స్వస్తి చెప్పి 66 ఏళ్ళ వయసులో మళ్ళీ తన ఫ్యాన్స్ కోరుకునే మాస్ రూట్ పట్టబోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య ఇవన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మసాలాలు దట్టించిన ఎంటర్ టైనర్లు. అన్నీ హీరో సెంట్రిక్ గానే సాగుతాయి. ఎలాంటి సందేశాలు ఉండవు. ఒకప్పటి వింటేజ్ చిరుని చూపించే ప్రయత్నం ఈ దర్శకులందరూ బిజీగా ఉన్నారు. అందులోనూ ఒకేసారి ఇలా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడం మెగాస్టార్ అయ్యాక చిరు చేసిన దాఖలాలు లేవు. ఇంత లేట్ ఏజ్ లోనూ ఇప్పటి జెనరేషన్ హీరోలకు పోటీ ఇస్తున్న చిరు నిజంగా చిరంజీవే

Also Read: బాలయ్య ఎప్పుడు వస్తున్నట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి