iDreamPost

అమెరికా-చైనా టెక్ వార్.. 5 కోట్ల కంప్యూటర్లని చెత్తకుప్పలో పడేస్తున్న చైనా..

అమెరికా-చైనా టెక్ వార్.. 5 కోట్ల కంప్యూటర్లని చెత్తకుప్పలో పడేస్తున్న చైనా..

చైనా-అమెరికాలు అన్ని విషయాల్లోనూ పోటీ పడతాయని మనకు తెలిసిన విషయమే. బిజినెస్, టెక్నాలజీ, దేశ భద్రత సమీకరణ, ప్రపంచంపై ఆధిపత్య ధోరణి.. ఇలాంటి చాలా విషయాల్లో అమెరికా-చైనాలు ఎప్పట్నుంచో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఒకరి మీద ఒకరికి ఆధిపత్య ధోరణి మరింత ఎక్కువవడంతో చైనా కఠినమైన నిర్ణయాలని తీసుకుంటుంది. చైనా-అమెరికా మధ్య టెక్ వార్ ఎప్పట్నుంచో నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చైనా కంటే టెక్నాలజీలో అమెరికా ఒక అడుగు ముందే ఉంది. చైనాలో కూడా టెక్నలాజికి సంబంధించిన వ్యాపారంలో అక్కడి దేశీయ కంపెనీల కంటే అమెరికానే ఎక్కువ బిజినెస్ చేస్తుంది.

తాజాగా చైనా తమ దేశంలో విదేశీ టెక్నాలజీలని తీసెయ్యడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా చైనాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో విదేశీ కంప్యూటర్ లని తొలగించి దేశీయ సాంకేతికతో తయారు చేసిన కంప్యూటర్లని భర్తీ చేయాలని ఇప్పటికే చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే రెండేళ్లలోనే ఈ మార్పు అంతా పూర్తి అవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఒక్క చైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనే 50 మిలియన్ల కంప్యూటర్లను భర్తీ చేయనున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో ఈ 5 కోట్ల కంప్యూటర్లు చెత్తకుప్పలోకి పోనున్నాయి. అలాగే చిప్‌ల నుండి సర్వర్‌లు, ఫోన్‌ల వరకు ప్రతిదానికి టెక్నాలజీలో అమెరికా మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చైనా చూస్తుంది.

చైనాలో దేశీయ కంపెనీ లెనోవా తర్వాత అతిపెద్ద PC బ్రాండ్లు అమెరికాకి చెందిన HP మరియు Dell. వీటిని దశల వారీగా నిర్మూలించాలని చూస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం 2021 నాల్గవ త్రైమాసికంలోనే చైనా సొంత కంప్యూటర్ల కొనుగోళ్లు 9% పెరిగి 16.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. చైనా మార్కెట్ లో Lenovo 41.8 శాతం, డెల్ 12.5 శాతం, HP 9.2 శాతం, ఆసుస్ 5.5 శాతం, మరియు ఏసర్ 5.2 శాతం వాటాని కలిగి ఉన్నాయి. చైనా తీసుకున్న ఈ నిర్ణయాలతో భద్రతా ఆందోళనలు పెరుగుతాయని, స్థానిక విక్రేతలకు ప్రాధాన్యత ఉంటుందని, అమెరికా కంపెనీలు HP మరియు డెల్ లాంటి వాటిపై మరింత ఒత్తిడిని తీసుకొస్తుందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Intel మరియు AMD ప్రాసెసర్‌ లాంటి రీప్లేస్ చేయడానికి కష్టంగా ఉండే భాగాలను మినహాయించి మిగతా కంప్యూటర్ పరికరాలన్నీ దేశీయ సాంకేతికతోనే భర్తీ చేయాలని చైనా ఆదేశించింది. అలాగే అమెరికా మైక్రోసాఫ్ట్ విండోస్‌కు ప్రత్యామ్నాయంగా Linux-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని చైనా భావిస్తోంది. చైనా విధించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్న నిర్దిష్ట ఏజెన్సీలు మాత్రమే అధునాతన విదేశీ సాంకేతికతను కొనుగోలు చేయాలి. చైనాలోని TCL టెక్నాలజీ, షాంఘై డేటా ఎక్స్ఛేంజ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆపరేటర్ MTR కార్పొరేషన్ లు ప్రభుత్వంతో ఇందుకు జతకూడాయి.

ఇటీవల కరోనా వల్ల, చైనా చేసిన పనుల వల్ల చాలా దేశాలు చైనాతో వాణిజ్యం బహిష్కరించాయి. కొన్ని చైనా కంపెనీలని కూడా తమ దేశాల్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. అమెరికాతో పాటు భారత్ కూడా కొన్ని చైనా కంపెనీలని తొలిగించిన సంగతి తెలిసిందే. దీంతో చైనాలోని చాలా సంస్థలు తీవ్ర నష్టాలని చూశాయి. దీంతో చైనా దేశీయ సాంకేతికని మరింత అభివృద్ధిపరచాలని, అమెరికా-విదేశీ టెక్నాలజీలని దిగుమతి చేసుకోవడం ఆపేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి