iDreamPost

బాబు, ఎన్నికలంటే సోషల్ మీడియా పోల్ కాదు

బాబు, ఎన్నికలంటే సోషల్ మీడియా పోల్ కాదు

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ఫార్టీ ఇయ‌ర్ ఇండ‌స్ట్రీగా చెప్పుకునే చంద్ర‌బాబు చివ‌ర‌కు సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో సామాన్య కార్య‌క‌ర్త మాదిరిగా మాట్లాడ‌డం విశేషంగా మారుతోంది. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియా ప్ర‌తినిధుల‌పై దాడికి పాల్ప‌డి , రిమాండ్ లో ఉన్న నిందితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈసంద‌ర్భంగా మీడియా తో మాట్లాడుతూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి.

రాజ‌ధాని విష‌యంలో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై చంద్రబాబు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తొలుత కొంత సందిగ్ధంలో ప‌డిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఉద్య‌మం ఊపందుకోవాల‌నే ఉద్దేశంతో స్వ‌యంగా ఆయ‌నే రంగంలో దిగారు. అయినా రాజ‌ధాని గ్రామాల ప‌రిధిలో కూడా పూర్తిగా విస్త‌రించ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి పేరుతో వివిధ పార్టీల‌ను క‌లుపుకుని ముందుకెళుతున్నామ‌నే అభిప్రాయం క‌లిగించే య‌త్నం చేస్తున్నారు.

తీరా చూస్తే చంద్ర‌బాబు తీరు, వ్య‌వ‌హారం, కామెంట్స్ కూడా రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత హోదాకి త‌గ్గ స్థాయిలో క‌నిపించ‌క‌పోవ‌డం విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. రాజ‌ధాని మార్పు చేసే అధికారం సీఎంకి ఎవ‌రిచ్చారంటూ ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్నారు. కానీ అంత‌కుముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో ఓటుకి నోటు కేసులో ప‌రిణామాల కార‌ణంగా హ‌ఠాత్తుగా ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ పై ఉన్న హ‌క్కుని వ‌దులుకుని వ‌చ్చే హ‌క్కు చంద్ర‌బాబుకి ఎవ‌రిచ్చారో ఆయ‌న తెలుసుకోక‌పోవ‌డం విశేషం. అంతేగాకుండా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేసి, అందుకు అనుగుణంగా త‌న అనుయాయుల‌తో భూములు కొనుగోలు చేసి, అన్నీ పూర్త‌యిన త‌ర్వాత అసెంబ్లీలో ప్ర‌క‌టించే అధికారం చంద్ర‌బాబుకి ఎవ‌రిచ్చారో కూడా ఆయ‌న మ‌ర‌చిపోయిన‌ట్టున్నారు. క‌నీసం ఒక్క‌సారి కూడా అఖిల‌ప‌క్షం నిర్వ‌హించ‌కుండా అన్నీ , అంత‌టా తానే అన్న‌ట్టుగా సాగించిన వ్య‌వ‌హారాల‌కు అధికారం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో బాబు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయినా ఇప్పుడు చంద్ర‌బాబు మాత్రం జ‌గ‌న్ ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా రాజ‌ధాని అంశంలో అంత‌ర్జాతీయ సంస్థ‌లు, ప‌లువురు నిపుణుల‌తో వేసిన క‌మిటీల రిపోర్టులు ప‌రిశీలించి, వాటిని హైప‌వ‌ర్ క‌మిటీ ప‌రిశీల‌న త‌ర్వాత అసెంబ్లీలో ఆమోదానికి పెట్టిన త‌ర్వాత మాత్ర‌మే రాజ‌ధాని అంశం నిర్ణ‌యిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే చంద్ర‌బాబు మాత్రం అందుకు భిన్నంగా తాను వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం జ‌నం మ‌ర‌చిపోయార‌ని భావించి కొత్త కొత్త ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. పైగా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లి, ఆత‌ర్వాత రాజ‌ధాని మార్చుకోవాల‌ని స‌వాల్ చేస్తున్నారు.

ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లంటే ఆ వ్య‌యం ఎవ‌రు భ‌రించాలో బాబుకి తెలుసా..అయినా ప్ర‌జాతీర్పు అమ‌రావ‌తి లో చంద్ర‌బాబు వైఫ‌ల్యాన్ని స్ప‌ష్టంగా చేసింది రాజ‌ధాని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా టీడీపీని ఓటించ‌డం ద్వారా చాటిచెప్పిన త‌ర్వాత రాజ్యాంగ విరుద్ధంగా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న కోర‌డం అనుభ‌వాన్ని ఎక్క‌డ దాచిపెట్టిన‌ట్టో అర్థంకాని అంశంగా ఉంది. ప్ర‌తీ నిర్ణ‌యంలోనూ ప్ర‌జాతీర్పు మ‌ళ్లీ మ‌ళ్లీ కోర‌డం ఎంత క‌ష్ట‌మో తెలిసి కూడా ఇలాంటి డిమాండ్ల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త స్థాయిలో ముందుకు తీసుకురావ‌డం విచిత్ంర‌గ‌తా క‌నిపిస్తోంది. తీవ్ర అస‌హ‌నంతో ఉన్న చంద్ర‌బాబు స్థాయి మ‌ర‌చి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి