iDreamPost

ఉద్యమాలు వద్దన్నారుగా బాబూ?

ఉద్యమాలు వద్దన్నారుగా బాబూ?

చంద్రబాబు రెండు నాలుకల మనిషి. చంద్రబాబు రాజకీయలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. తన అవసరాలకు, తన పార్టీ అవసరాలకు, తన సామజిక వర్గం అవసరాలకు అనుకూలంగా అయన ఎప్పటికప్పుడు తన విధానాలు మార్చుకుంటారు. అందుకే ఆయన్ను ప్రజలు యూ టర్న్ బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు.

అధికారంలో ఉండగా గడచిన ఐదేళ్ళు ఆయన చెప్పిందేంటి? ఉద్యమాల పేరుతో రోడ్డుమీదకు రావద్దు అన్నారు. అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం అయినా సరే… రోడ్డుమీదికి వచ్చి ఆందోళన చేస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతా అని హుకుం జారీ చేశారు. పనిలో పనిగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్రస్థాయి హెచ్చరిక కూడా చేశారు. భవిష్యత్తు జైలుపాలవుతుందని హెచ్చరికలు చేశారు.

ప్రతిపక్షాల నేతలు రాక్షసులన్నారు. ప్రతిపక్షాలు కేవలం అధికారం కోసమే ఏదో ఒక విషయం కోసం ఆందోళనలు చేస్తుంటారని, వారి ఉచ్చులో పడొద్దని హితవు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఐదేళ్ళపాటు పరిపాలించమని పార్టీలకు అధికారం ఇస్తారని, ప్రతిపక్షాలు మాత్రం అధికారంకోసం అన్ని అడ్డదార్లు తొక్కుతూ అభివృద్ధికి అడ్డం పడతాయని, ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని హెచ్చరికలు చేశారు.

సగం బహుళ పంటలతో సారవంతమైన భూములు, మరో సగం మెట్టభూములను రైతులనుండి బలవంతంగా సేకరించారు. శివరామకృష్ణన్ కమిటీతో పాటు అనేక ఆధునిక నగరాల నిపుణుల అభిప్రాయాలను కూడా పక్కన పెట్టి బురద భూముల్లో నిర్మాణాలు మొదలు పెట్టారు. ఒక నగర నిర్మాణం ఏ ఒక్కరూ చేసే పని కాదనీ, ఏ పాలకుడూ నగరాన్ని నిర్మించిన దాఖలాలు లేవనే చారిత్రక వాస్తవాన్ని ఆయన విస్మరించి ఒక అంతర్జాతీయ నగరం తాను నిర్మించబోతున్నట్టు డిజిటల్ కలలు నేర్పించారు. పాలకులు అధికారిక భవనాలు, నివాస భవనాలు మాత్రమే నిర్మిస్తారని, మిగతాభాగం అంతా ప్రజలు నిర్మించుకుంటారనే స్పృహ కూడా లేకుండా రైతులను పగటికలలో నడిపించేశారు.

ప్రణాళికలని, పోలవరం అని, భవన నమూనాలు అనీ ఐదేళ్ళు దేశీయ, విదేశీ యాత్రలతో కాలక్షేపం చేశారు. పెట్టుబడుల పండుగలు, సంక్రాంతి పండుగలు, కృష్ణా – గోదావరి పుష్కరాలు అంటూ పుణ్యకాలం పూర్తిచేశారు. ఇప్పుడు ఆరునెలల్లోనే కొత్త ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ రోడ్డెక్కుతున్నారు. తాను ఐదేళ్ళు చెప్పిన నీతిసూత్రాలు గాలికి వదిలేసి ప్రజల్ని రోడ్డుమీదికి రమ్మంటున్నారు. పోరాటం చేయమంటున్నారు. పోలీసుల లాఠీలు, తూటాలను ధిక్కరించమంటున్నారు. మీకు బాధ్యతలేదా, మీలో పోరుషం లేదా అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కోట్లు కూడబెట్టిన రైతులను, పట్టుచీరల మహిళలను రోడ్డుకు తెచ్చి విధ్వంసం సృస్టించమంటున్నారు.

ఈ రెండునాల్కల ధోరణి చంద్రబాబు వదలరు. ఏ అమరావతి గురించి గొప్పగా చెప్పుకొని ఇప్పుడు అన్యాయం అవుతోందని అంటున్నారో ఆ అమరావతి ప్రజలే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో తనను చిత్తుగా ఓడించిన వాస్తవం మర్చిపోయారు. ఏ ప్రజలను రోడ్డుపై ఆందోళనలకు రావద్దన్నారో ఆ ప్రజలే ఇప్పుడు తనతో రోడ్డుమీద విధ్వంసం సృష్టించేందుకు రమ్మని పిలుపిస్తున్నారు.

పోరాటం చట్టధిక్కారం అన్న ఆ నోటితోనే పోరాటానికి రండి అని పిలుస్తున్నారు. పోలీసు రూల్సు ధిక్కరించ వద్దన్న ఆ నోటితోనే పోలీసులను కొట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ అధికారం కోసం కుట్రలు చేస్తాయి అన్న ఆ నోటితోనే నేడు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని కూలదోద్దాం రండి అని పిలుపునిస్తున్నారు. ఐదేళ్ళపాటు పరిపాలించే అధికారం ప్రజలు మాకు ఇచ్చారు అన్న ఆ నోటితోనే నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు.

ఇది చంద్రబాబు అవకాశవాదానికి నిదర్శనం. ఇది చంద్రబాబు అధికారదాహానికి నిలువుటద్దం. చంద్రబాబు చెప్పిందే వేదం అని గంటలకొద్దీ టీవీల్లో, పేజీలకొద్దీ పత్రికల్లో వార్తలు రాసే కుల మీడియా అండగా ఉంది కాబట్టి చంద్రబాబు తాను ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిందన్న స్పృహ కూడా లేకుండా కుట్రరాజకీయాలు చేస్తున్నారు. ఈ కుట్ర రాజకీయాలను సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు చెప్పే కట్టుకథలు, పచ్చమీడియా అల్లే అబద్దాల కథనాలు వినేందుకు, నామమెందుకు ప్రజలు సిద్ధంగా లేరు అని గమనించకపోవడం అమరావతిలో పాతుకుపోయిన కులదురహంకారాన్ని స్పష్టం చేస్తోంది. చంద్రబాబు, ఆయన కుల మీడియా ఇలాంటి కలల ప్రపంచంలోనే బ్రతికితే అలాంటి రాజకీయాలకు నేటి ప్రజలు శాశ్వత సమాధికడతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి