iDreamPost

వాడెవడు…? వీడెవడు…?

వాడెవడు…? వీడెవడు…?

లోకంలో తానే గొప్ప వాడిని అన్న ఆలోచనతో ఉన్న వారు తమ చుట్టూ ఉన్న వారి పట్ల చులకన భావంతో ఉంటారు. వాడెవడు..? వీడెవడు..? అలా చేసే అధికారం ఎవరిచ్చారు..? వాడు చెప్పేవాడా..? ఇలాంటి మాటలు బూర్జువా సమాజంలో చూశాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తాను బూర్జువా సమాజంలో ఉన్నట్లుగా భావిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు, ఆ అధికారానికి దూరమైనప్పుడు తన తీరు మాత్రం ఒకేలా ఉంటోందని ఇటీవల ఆయన ప్రవర్తను బట్టీ అంచనా వేయొచ్చు. ముఖ్యమంత్రిని, అధికారులను ఆయన సంభోధించే తీరు గమనిస్తుంటే ఇంకా ఆయనే ముఖ్యమంత్రి, లేదా ముఖ్యమంత్రి ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు తానే చక్రవర్తి అన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు.

ఇటీవల సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పట్ల నారా చంద్రబాబునాయుడు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా కార్యదర్శిగా విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఇది ఆయన బాధ్యత కూడా. ఈ వివరాలు వెల్లడించిన విజయ్‌కుమార్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు ‘‘ విజయ్‌కుమార్‌ గాడు’’ నాకు చెప్పేవాడా..? అంటూ ఏకవచనంతో మాట్లాడారు. ఈ మాటలో చంద్రబాబులోని అహంకారం కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పొరపాటున అనుంటే.. ఈపాటికే చంద్రబాబు వివరణ ఇచ్చేవారని కానీ అలా చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయ్‌కుమార్‌ కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేది ఐఏఎస్‌ అధికారులు.. ఆయా ప్రభుత్వాల పెద్దలు/ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే వారి ఆదేశాలను పాటిస్తారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీగా తన ఆదేశాలు పాటించిన విజయ్‌కుమార్‌ ఈ రోజు అమరావతిపై తనకే చెప్పేవాడా..? అన్నట్లుగా చంద్రబాబు భావించినట్లున్నారు. ఈ సయమంలో విజయ్‌కుమార్‌ కేవలం బీజీసీ నివేదికలోని అంశాలను వెల్లడించారని, ఆ నివేదిక అతను తయారు చేయలేదన్న స్పృహ చంద్రబాబుకు లేకుండా పోవడం ఆయన సీనియారిటీకి పెద్ద మచ్చగా చెప్పవచ్చు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ దళిత కుటుంబంలో జన్మించిన విజయ్‌కుమార్‌ తినడానికి తిండిలేని స్థాయి నుంచి ఐఏఎస్‌గా ఎదిగారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించొచ్చనని పేదరికాన్ని జయించిన విజయ్‌కుమార్‌ జీవన పయనం ఆదర్శవంతమైంది. స్థాయి ఏదైనా సరే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధిస్తుంటారు. కులం, మతం, ఆస్తి, చదువుతో సంబంధంలేకుండా గౌరవ మర్యాదులు పొందే హక్కు ప్రతి ఒక్కరీ ఉంది. మరి.. ఓ ఐఏఎస్‌ అధికారిని ‘‘గాడు’’ అని సంభోధిస్తున్న చంద్రబాబు తన కుమారుడు, మనవడుకు 70 ఏళ్ల వయస్సులో తన ప్రవర్తనతో ఏం నేర్పిస్తున్నారనేది ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి