iDreamPost

లాక్ డౌన్ నియమాలు ఖచ్చితంగా పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

లాక్ డౌన్ నియమాలు ఖచ్చితంగా  పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్రం ఈ నెల 15న జారీచేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం కొన్ని సడలింపు ఇవ్వటంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.కేంద్రం హెచ్చరికలతో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇచ్చిన మినహాయింపులపై కేరళ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టామ్ జోస్‌తో సమావేశమై కేంద్ర అభ్యంతరాలపై చర్చించారు.

తాజాగా రెస్టారెంట్లు, బార్బర్ షాపులు తెరవడం, ఇంటర్ సిటీ బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొరియర్ సర్వీసులకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

అంతకుముందు విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం ఈ నెల 15న విడుదల చేసిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తూ కేరళ ప్రభుత్వం అదనపు సడలింపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించింది.ఈ మేరకు కేంద్రం హోం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా లేఖ రాశారు.

హోం శాఖ లేఖపై స్పందించిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మినహాయింపులిచ్చాం.కానీ సమాచార లోపంతో కేంద్రం మమ్మల్ని అపార్థం చేసుకుంది.కరోనా నియంత్రణపై బేధాభిప్రాయాలకు తావు లేకుండా రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో కలిసి పని చేస్తుందని ప్రకటించారు. కేంద్రానికి సడలింపులపై వివరణ ఇస్తే సమస్య ముగిసి పోతుందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి