iDreamPost

కరోనా- కేంద్రం తక్షణ సహాయం కోసం 17,287 కోట్లు

కరోనా- కేంద్రం తక్షణ సహాయం కోసం 17,287 కోట్లు

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మరింత విజృభిస్తోంది. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 2570 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 63 మంది మరణించారు. ఈక్రమంలో వైరస్‌ను రాష్ట్రాలు మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు రూ.17,287 కోట్లు విడుదల చేసింది.

కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు 15 వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు ఆదాయలోటు గ్రాంటు రూ. 6195 కోట్లు కలిపి ఉన్నాయి. ఆదాయలోటు గ్రాంట్‌ను ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, అస్సామ్, నాగాలాండ్ మణిపూర్‌, మేఘాలయ, సిక్కిం మిజోరాం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థికశాఖ మంజూరు చేసింది. ఈ వైరస్ ను ధీటుగా కట్టడి చేయటానికి ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్‌ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ.11,092 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ నిధులు కచ్చితంగా కరోనాను ఎదుర్కోవటానికి మాత్రమే ఉపయోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మరోవైపు చైనా నుండి ఇప్పటికే పలు వైద్య పరికరాలు, మందులు, మాస్కులు, దిగుమతి చేరుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. తాజాగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశమైనపుడు ఈ అంశం చర్చకు వచ్చింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుదామని, లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తోందని ప్రధాని అభిప్రాయ పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి