iDreamPost

కేంద్రం గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ పై రాయితీ పెంపు

కేంద్రం గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ పై రాయితీ పెంపు

వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నిత్యం పెరుగుతున్న ఉప్పు, పప్పు రేట్లను తట్టుకోలేకపోతున్న సామాన్యులకు గ్యాస్ ధరపై సబ్సిడీని మరింత పెంచి.. కాస్త ఊరటను కల్పించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం. కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీ య గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రెండు హామీలను ప్రధాని మోడీ ప్రస్తావించిన సంగతి విదితమే. మరికొన్నిరోజుల్లో తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కథ తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపింది.

కాగా, ఇప్పుడు వంట గ్యాస్ ధర రాయితీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ పై మరో రూ. 100 సబ్సిడీ ఇస్తన్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద వంట గ్యాస్ తీసుకున్న వారికి ఈ సబ్సిడీ వర్తించనుంది. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ పై కేంద్రం రూ. 200 చొప్పున సబ్సిడీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని రూ. 300 లకు పెంచింది. దీంతో 14.2 కిలోల సిలిండర్ మార్కెట్ ధర రూ. 903కు బదులుగా ప్రస్తుతం రూ. 703 చెల్లిస్తుండగా.. ఇప్పుడు ఈ రాయితీతో రూ. 603 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు కేంద్రం రూ.200 మేర సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రూ. 100 సబ్సిడీ ఇస్తుండటంతో మొత్తం రాయితీ రూ.300కు చేరింది. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి