iDreamPost

బీజేపీ కొంప ముంచనున్న గ్లాస్..!

బీజేపీ కొంప ముంచనున్న గ్లాస్..!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు హోరెత్తిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపు వైసీపీదే అనే విషయం స్పష్టమైనప్పటికీ.. రెండో స్థానం కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ శ్రమటోడుస్తున్నాయి.

అయితే బీజేపీ ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ తో పొత్తు పొట్టుకోవడంతో ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి పోటీలో నిల్చున్నారు. తాజా ఉపఎన్నికల్లో బీజేపీ తో జనసేన పొత్తు పెట్టుకుంది. దీంతో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నాయకురాలు రత్నప్రభ బరిలో నిల్చున్నారు.

జనసేనకు గత ఎన్నికల్లో కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఈ గుర్తు పైనే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో ఓడిపోయారు.

అయితే తాజా ఉప ఎన్నికల్లో జనసేన బరిలో లేకపోవడంతో గాజు గ్లాస్ గుర్తు నవతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గోదా రమేషకుమార్ కు దక్కింది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి, గుర్తింపు పొందిన పార్టీకి మాత్రమే శాశ్వత గుర్తును కేటాయిస్తుంది. ఎన్నికల సంఘం ప్రమాణాలను అందుకోవడంలో జనసేన విఫలమవడంతో ఆ పార్టీకి ఇంకా శాశ్వత గుర్తు లభించలేదు.

Also Read : తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?

ఎన్నికల సంఘం నిబంధనలు ఇలా..!

సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఐదు ఏండ్లలో ఏదేని స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల్లో పది శాతం సీట్లలో పోటీ చేయకుంటే కేటాయించిన గుర్తులు రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. కేటాయించిన గుర్తులు సదరు పార్టీ తరపున పోటీచేసే స్థానాల వరకే పరిమితంగా ఉంటాయి. పోటీ చేయని స్థానాలలో ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు ఆ గుర్తులను కేటాయించే అవకాశం ఉంటుంది.

శాశ్వత గుర్తు రావాలంటే ఇలా..!

సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధిస్తే అప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ పార్టీలకు కేటాయించిన గుర్తులు ఇంకా ఏ రాష్ట్రంలోనూ వేరే ఏ పార్టీకి కేటాయించరు. అలాగే ప్రాంతీయ పార్టీకి శాశ్వత గుర్తు రావాలంటే.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు గెలుపొందితే అప్పుడు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. అలాగే కామన్ సింబల్ శాశ్వతంగా ఉండిపోతుంది. జనసేన తొలి సారిగా 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. 5.58 శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆ పార్టీ కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానం తో సరిపెట్టుకుంది.

జనసేన గుర్తు గాజు గ్లాస్(టీ గ్లాస్) అనే విషయం ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే. గాజు గ్లాస్ వేరే స్వతంత్ర అభ్యర్థికి దక్కడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలే గత ఎన్నికలో బీజేపీకి కేవలం 16 వేల చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి సమయంలో జనసేన గుర్తుగా ప్రజల్లోకి బలంగా వెళ్లిన గాజు గ్లాస్ తమ కొంప ముంచుతుందేమో అన్న భయం .. ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది.

Also Read : తిరుపతి ఉప ఎన్నికలు : జనసైనికులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ పాట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి