P Venkatesh
P Venkatesh
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షణ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. కాగా ఇటీవల ఈసీ ఎలక్షన్ల నిర్వహణ, అవకతవకలకు అవకాశం లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే విధంగా అధికారులకు, రాజకీయ పార్టీల నాయకులకు సూచించింది. దీనిలో భాగంగానే పోలీసులు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేపట్టి భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో తనిఖీల్లో భాగంగా పోలీసులు పలు ప్రాంతాల్లో నగదు, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన తాయిలాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం వెండి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిజాం కాలేజ్ పరిసరాల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో గేట్ నంబర్ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్ చేశారు. చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఫిలింనగర్ పరిధిలో ఓ కారులో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తరలిస్తున్న రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ పరిధిలో రూ.15 లక్షల నగదు పట్టుబడింది.శేరిలింగంపల్లి గోపన్‌పల్లి తండాలో ఓటర్లకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడి వద్ద రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.