iDreamPost

వైసిపి ఎంపికి కేసుల బెదిరింపులా ?

వైసిపి ఎంపికి కేసుల బెదిరింపులా ?

ప్రతిపక్ష నేతలు వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డిని బెదిరించటం మొదలుపెట్టారు. తమకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బెదిరించాడు. ఇదే తరహా బెదిరింపులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రెండు రోజుల క్రితమే చేశాడు. పైగా విజయసాయిరెడ్డి మీద కేసు వేయటానికి తమ జాతీయ పార్టీ నాయకత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు చెప్పటం గమనార్హం.

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఢిల్లీకి ఓ లేఖ వెళ్ళిన విషయం రాజకీయంగా ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ లేఖను తాను రాయలేదని అప్పట్లోనే నిమ్మగడ్డ చెప్పాడు. దాదాపు నెలరోజుల తర్వాత నిమ్మగడ్డ లేఖపై దర్యాప్తు చేయాలంటూ విజయసాయి ఫిర్యాదు చేశాడు. ఎప్పుడైతే ఎంపి ఫిర్యాదు చేశాడో అదే రోజున నిమ్మగడ్డ మీడియాకు జారీ చేసిన నోట్ లో కేంద్ర హోంశాఖకు తానే లేఖ రాసినట్లు అంగీకరించాడు.

సరే నిమ్మగడ్డ వెర్షన్ ఎలాగున్నా ఎంపి చేసిన ఫిర్యాదులో రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, సీనియర్ నేతలు వర్ల రామయ్య, టిడి జనార్ధనరావు ఆధ్వర్యంలోనే లేఖ తయారైందని ఆరోపించాడు. అంతేకాకుండా నిమ్మగడ్డ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు కూడా ఆరోపించాడు. ఇపుడా ఆరోపణలపైనే వర్ల స్పందించాడు. తనపై విజయసాయి చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ బెదిరించటమే విచిత్రంగా ఉంది. విజయసాయి ఆరోపణలు తప్పయితే మళ్ళీ క్షమాపణలు అడగటమెందుకు ? నేరుగా పరువునష్టం దావా వేయకుండా బెదిరింపులెందుకు ?

ఇక కన్నా విషయం చూస్తే తాను చంద్రబాబునాయుడు దగ్గర రూ. 20 కోట్లు తీసుకున్నట్లు విజయసాయి చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా కేసు వేస్తానంటూ బెదిరించాడు. ఈయనది కూడా వర్ల పద్దతే. తనకు క్షమాపణ చెప్పకపోతేనే కేసు వేస్తాడట. ఈ కండీషన్ ఎందుకో అర్ధం కావటం లేదు. తమకు క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని బెదిరిస్తున్నారంటే తమకు కోర్టులో కేసులు వేసే ఉద్దేశ్యం లేదని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లే ఉంది. ఒకవైపేమో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు విజయసాయి చెబుతుంటే మళ్ళీ క్షమాపణలు కోరటంలో అర్ధముందా ?

సరే వీళ్ళ ఆరోపణలు, బెదిరింపులు ఎలాగున్న నిమ్మగడ్డ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిఐడి అడిషినల్ డిజి సుశీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖ మాజీ కమీషనర్ రాయలేదని చెప్పారు. నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖ కమీషన్ కార్యాలయం బయటనుండి వచ్చిందని మాజీ కమీషనర్ కు అడిషినల్ పిఎస్ గా పనిచేసిన సాంబమూర్తి అంగీకరించినట్లు అడిషినల్ డిజి చెప్పారు. విచారణలో భాగంగా లేఖ విషయంలో సాంబమూర్తి చెప్పిన విషయాలపై తొందరలోనే మరింత క్లారిటి వస్తుందని కూడా సుశీల్ చెప్పారు. అంటే అప్పటి వరకు విజయసాయికి ఇటువంటి బెదిరింపులు వస్తునే ఉంటాయన్నమాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి