iDreamPost

జగన్ నిర్ణయం-క్యాబినెట్ తదుపరి సమావేశం విశాఖలోనే

జగన్ నిర్ణయం-క్యాబినెట్ తదుపరి సమావేశం విశాఖలోనే

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్రమంగా అమలు చేసేందుకు పూనుకుంటున్నారు. పాలనా సంస్కరణలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్, తాజాగా రాజధానుల విషయంలో కూడా స్పష్టతకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో సెక్రటేరియేట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాటికి అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సడలింపుల తర్వాత మళ్లీ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు కనిపిస్తోంది.

గతంలోనే జగన్ ప్రకటించినట్టుగా సీఎం ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన అన్నట్టుగా సాగాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తొలి అడుగులో భాగంగా ఏపీ క్యాబినెట్ భేటీని విశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జూన్ 5నాడు క్యాబినెట్ జరపాలని తొలుత నిర్ణయించారు. అయితే ప్రస్తుతం సమావేశం తేదీ ఖరారు కాలేదని చెబుతున్నారు. ఈ వారాంతంలో గానీ, వచ్చే వారం మొదట్లో గానీ క్యాబినెట్ జరగబోతోంది. అది ఎప్పుడు జరిగినా విశాఖలోనే మంత్రిమండలి సమావేశం అవుతుందని మాత్రం చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం కూడా 2014లో విశాఖలోనే జరగడం విశేషం. అప్పట్లో ఏయూ కాన్ఫరెన్స్ హాల్ లో చంద్రబాబు మంత్రివర్గం సమావేశం అయ్యింది. మళ్లీ ఆ తర్వాత ఆయన చెప్పిన మాటకు భిన్నంగా సాగింది. తొలుత హైదరాబాద్ , ఆ తర్వాత అమరావితికే పరిమితం అయ్యారు. కానీ ప్రస్తుతం జగన్ మాత్రం ఎటువంటి ప్రకటనలు లేకుండానే తన నిర్ణయాన్ని అమలు చేసే దిశలో సాగుతున్నారు. దానికి అనుగుణంగా తదుపరి క్యాబినెట్ భేటీని విశాఖలో జరిపేందుకు సన్నద్దమవుతున్నారు. కొంతకాలంగా ఏపీ సెక్రటేరియేట్ లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా సచివాలయంలో కరోనా కేసులు నమోదు కావడంతో కొన్ని బ్లాకులు మూసివేయాల్సి వచ్చింది. అదే సమయంలో సిబ్బందికి కూడా సెలవులు ప్రకటించారు. ఇలాంటి సమయంలో సచివాలయం కన్నా విశాఖ ఉత్తమం అని జగన్ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.

ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్న జగన్ ఈ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆర్థిక స్థితి, బడ్జెట్ రూపకల్పన వంటి అంశాలకు తోడుగా రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై క్యాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో జగన్ సారద్యంలో తొలిసారిగా విశాఖలో మంత్రివర్గం సమావేశం అయితే రాజకీయంగానూ, ఏపీలో పాలనా పరంగానూ కీలకమైన ముందడుగు అవుతుంది. అదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి