iDreamPost

మంత్రివర్గ సమావేశం.. విశాఖా..? అమరావతా..?

మంత్రివర్గ సమావేశం.. విశాఖా..? అమరావతా..?

ఎప్పటి లాగే ఈ సారి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ప్రతి పదిహేను రోజులకు జగన్‌ కేబినెట్‌ సమావేశమై రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై పలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి జరగబోయే మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్ర సమాగ్రాభివృద్ధి, రాజధాని అంశాలపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ మంత్రి వర్గంలో చర్చించనున్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు ప్రాంతాలను సమానంగా గుర్తిస్తూ అభివృద్ధి చేయాలని.. జీఎన్‌ రావు కమిటీ తన నివేదకలో పొందుపర్చింది. రాయలసీమ ప్రాంతానికి న్యాయరాజధాని కర్నూలులో, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధాని విశాఖలో, కోస్తా ప్రాంతానికి అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.

అయితే మంత్రి వర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రేపు 27వ తేదీ శుక్రవారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఈ సమావేశంలో ఎక్కడ నిర్వహిస్తారన్న విషయం తెలుపలేదు. ఎప్పటిలాగే అమరావతిలోనే నిర్వహిస్తారా..? లేక మరో చోట నిర్వహిస్తారా..? అన్న విషయంపై స్పష్టత లేదు.

విశాఖలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని ఇటీవల మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ప్రకటన రాలేదు. మరోవైపు ఎప్పటిలాగే కేబినెట్‌ మీటింగ్‌ అమరావతిలో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా సచివాలయానికి వెళ్లే దారుల్లో జరుగుతున్న నిరసనలపై పోలీసులు దృష్టి సారించారు.

సచివాలయానికి వెళ్లే మార్గంలో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. నిరసన కారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్ల వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమరావతిలోనే మంత్రివర్గ సమావేశం జరుగుతుందన్న భావన ప్రజల్లో నెలకొంది. మంత్రివర్గ సమావేశం ఎప్పటిలాగే అమరావాతిలోనా..? లేక ప్రతిపాదిత కార్యనిర్వాహఖ రాజధాని విశాఖలోనా..? అన్నది మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి