iDreamPost

చ‌క్ర వ్యూహంలో క్యాబ్ డ్రైవ‌ర్లు

చ‌క్ర వ్యూహంలో క్యాబ్ డ్రైవ‌ర్లు

క‌రోనాతో క్యాబ్ డ్రైవ‌ర్లు న‌లిగిపోతున్నారు. మొద‌ట ఇన్‌ఫెక్ష‌న్‌కు భ‌య‌ప‌డ్డారు. ఇప్పుడు బ‌తుకు భ‌యంతో ఉన్నారు. 15 రోజుల‌కే ప‌రిస్థితి ఇంత దిగ‌జారుతుంద‌ని ఊహించ‌లేక‌పోయారు.

క‌రోనా గురించి విన్న‌ప్పుడు మూతికి మాస్క్ క‌ట్టుకుని జాగ్ర‌త్త ప‌డ్డారు. ప్యాసింజ‌ర్ల వ‌ల్ల అది త‌మ‌కి ఎక్క‌డ వస్తుందోన‌ని భ‌యంభ‌యంగా ఉన్నారు. కొంద‌రు ట్రిప్పులు త‌గ్గించుకున్నారు. ఇపుడు ఎక్కితే చాల‌నుకుంటున్నారు. అయినా ఎక్కేవాళ్లు లేరు.

క్యాబ్ డ్రైవ‌ర్ల‌లో ఎక్కువ మంది EMIలు క‌ట్టేవాళ్లే. వాళ్ల‌కు వ‌చ్చే ఆదాయంలో EMI, పెట్రోల్‌, OLA లేదా Uber వాడి క‌మీష‌న్ పోనూ మిగిలిన దాంతో ఇల్లు గ‌డుపుకునే వాళ్లు. ఇప్పుడు EMI కూడా క‌ట్ట‌లేని స్థితి. థియేట‌ర్లు లేవు, మాల్స్ లేవు, పెళ్లిళ్లు లేవు. అన్నింటికి మించి IT కంపెనీలు సెల‌వు ప్ర‌క‌టించి Work From Home అంటున్నాయి. ఒక్క IT మీదే కొన్ని వేల క్యాబ్‌లు బ‌తుకుతున్నాయి.

EMIలు తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని ఢిల్లీలోని క్యాబ్ డ్రైవ‌ర్ల సంఘం కేజ్రీవాల్‌ను కోర‌నుంది. ఇక్క‌డ తెలంగాణాలో కూడా KCRని క‌లిసి విజ్ఞ‌ప్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. అదే విధంగా ప‌రిస్థితి మెరుగుప‌డే వ‌ర‌కు క‌మీష‌న్ త‌గ్గించుకోమ‌ని OLA/ Uber సంస్థ‌ల‌ని అడుగుతున్నారు. అయితే వారి నుంచి ఏ స్పంద‌నా లేదు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని న‌మ్ముకుని కొన్ని వంద‌ల క్యాబ్‌లు బ‌తికేవి. ప్ర‌యాణికులు లేక ఎయిర్‌పోర్ట్ బోసిపోయింది. క్యాబ్‌లు కూడా క‌న‌ప‌డ‌డం లేదు. ఈ డ్రైవ‌ర్ల‌లో ఎక్కువ మంది తెలంగాణా జిల్లాల నుంచి బ‌త‌క‌డానికి వ‌చ్చిన వాళ్లే. ఇక్క‌డ పిల్ల‌ల చ‌దువులు సాగుతున్నాయి. వెన‌క్కి పోలేరు. ఇక్క‌డ ఉండ‌లేరు. ఇంటికి కిరాయి కూడా క‌ట్టాలి. అప్పు పుట్టే ప‌రిస్థితి లేదు. వ్యాపారాలు లేక ఎవ‌డి ద‌గ్గ‌రా డ‌బ్బుల్లేవు.

GST , డీమానిటైజేష‌న్‌లో కూడా ఇంత అన్యాయం లేదు. క‌నీసం మ‌నుషులు తిరిగేవాళ్లు. ఒక‌ర్ని చూసి ఇంకొక‌రు భ‌య‌ప‌డుతున్నారు. తుమ్మితే బాంబు పేలిన‌ట్టు చూస్తున్నారు.

గూగుల్ రోడ్డు మీద దారి చూపిస్తుంది కానీ, బ‌త‌కడానికి దారి ఏదీ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి