iDreamPost

నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ..

నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ..

భారత రాజకీయాల్లో అనేక పార్టీలు పుట్టి సంస్థాగత నిర్మాణం చేయలేక ప్రజల మద్దతు కూడగట్టలేక కాలగర్భంలో కలిసిపోగా , కొన్ని సంస్థలు మాత్రం వారి భావజాలన్ని నిఘాడంగా ఉంచుతూ వివిద పార్టీల రూపాల్లో ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల రణరంగంలో విజేతలుగా నిలిచారు, అటువంటి పార్టీల జాబితాలోకే భారతీయ జనతా పార్టీ వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. జన సంఘ్ తో మొదలైన భావజాలం వివిద దశలు మార్చుకుంటు భారతీయ జనతా పార్టీ వరకు వచ్చి చివరికి దేశ ప్రధాని పీఠం అధిరోహించే వరకు సాగిన బిజేపి ప్రస్థానం కచ్చితంగా రాజకీయ చరిత్రలో  అతి ముఖ్యమైన ఘట్టం. మునుపెన్నడూ లేనంత బలీయమైన శక్తిగా మారి నేటితో 40 వసంతాలు నిండిన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం పై చర్చించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భారతీయ జనసంఘ్:-

హిందుత్వ, హిందూ భావజాలం ఆదారంగా ప్రముఖ జాతీయవాద నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా “భారతీయ జనసంఘ్” పార్టీని స్థాపించారు. యావత్ భారతదేశం ఏళ్ల తరబడి పోరాడి బ్రిటీష్ కబంద హస్తాల నుండి సాధించుకున్న స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యంతో సురక్షితం చేయడానికి భారత రాజ్యంగాన్ని 1950 జనవరి 26న అమలులోకి తెచ్చారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో కేవలం నాలుగు నెలల వ్యవదిలోనే భారతదేశం ఎన్నికలు నిర్వహించి తొలి అడుగు వేసింది. అనాడు జరిగిన ఆ ఎన్నికలు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ప్రయోగం.

ఎన్నికల అనుభవమే లేని 173 మిలియన్లకు పైగా ఓటర్లు, అందులో నిరుపేద , నిరక్షరాస్యత , గ్రామీణ ప్రాంతం వారు అత్యధికంగా ఉండటంతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారా అనే అనుమానాల మధ్య జరిగిన ఎన్నికల్లో 45% ఓట్లతో 489 లోక్ సభ స్థానాలకు గాను జోడెడ్లు గుర్తుతో ఎన్నికలు ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 364 సీట్లు సాదించగా “దీపం” గుర్తుతో ఎన్నికలు ఎదుర్కున్న భారతీయ జనసంఘ్ అత్యల్పంగా 3.1% ఓట్లతో కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. గెలిచిన ఆ ముగ్గురులో పార్టి వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు కాగా, వృతిరీత్యా క్రిమినల్ లాయర్ అయిన దుర్గా చరణ్ బెనర్జీ (వెస్ట్ బెంగాల్ నుండి),కాంగ్రెస్ లో ఉండి ముఖర్జి పిలుపుతో జన సంఘ్ లోకి వచ్చిన ఉమా శంకర్ త్రివేది రాజస్థాన్ నుండి గెలిచారు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ పార్టీ ప్రకటించిన 1951 నుండి 1977లో జనసంఘ్ ను జనతా పార్టిలో కలిపే వరకు సాగిన 26ఏళ్ళ సుదీర్గ ప్రయాణంలో, అటల్ బిహారి వాజ్ పాయి, లాల్ కృష్ణ అద్వాని, ఆచార్య గోష్, ఆచార్య బలరాజ్ మదోఖ్, ఆంద్ర ప్రదేశ్ కు చందిన అవసరాల రామారావు లాంటి ప్రముఖులు పార్టీకి అధ్యక్షులు గా పనిచేసినా కాంగ్రెస్ పార్టీతో పోటి పడలేక ఏ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేక పోయింది. 1967లో లోక్ సభకి జరిగిన సాధారణ ఎన్నికల్లో మాత్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ అధ్యక్షతన కొంచెం పుంజుకుని 35 స్థానాల్లో విజయం సాధించింది.

జనసంఘ్ నుండి జనతా పార్టీ:-

1975లో ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించిన తర్వాత అప్పటివరకు విపక్ష పార్టీలుగా ఉన్న భారతీయ జనసంఘ్,లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (O) విలీనమయ్యి ఉమ్మడిగా ఇందిరా మీద పోరాడాలని నిర్ణయించాయి. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ,”సంపూర్ణ విప్లవం”తో ఇందిరా పాలన మీద పోరాటం నడిపిన జయప్రకాష్ నారాయణ మార్గదర్శకత్వంలో చంద్రశేఖర్(మాజీ ప్రధాని) అధ్యక్షతన జనతా పార్టీని ఏర్పాటు చేశారు. దీని ఎన్నికల చిహ్నం “నాగలి పట్టిన రైతు”.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జనతా పార్టీకి అధ్యక్షులుగా తెన్నేటి విశ్వనాధం నియమితులయ్యారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పాటుచేసింది జనతాపార్టీ. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా, లాల్ కృష్ణ్ అద్వానీ సమాచార శాఖా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.

జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీగా:-

జనతా పార్టీ ఏర్పాటు అయిన రోజు నుండి ఏనాడు తామంతా ఒక్కటే అనే భావనకు రాలేదు. పరస్పర విశ్వాసం, సిద్దాంత సామరస్యం లేకపోయినా అధికారం కొంత కాలం ఆ పార్టీకి ప్రాణం పోసింది.

జనతా పార్టీలోని సోషలిస్టులకు జనసంఘ్ నెట్ల మధ్య నిత్యం సైద్ధాంతిక ఘర్షణలు ఉండేవి. ఒక పార్టీ ఒక సభ్యత్వం పేరుతో పాత జనసంఘ్ నేతలను RSS కు రాజీనామా చేయమని డిమాండ్ చేసేవారు. ఈ ఘర్షణ ముదిరి చివరికి జనసంఘ్ నేతలు వాజ్ పాయ్,అద్వానీ,మంత్రిపదవులు రాజీనామా చేసిన 1979 ఏప్రిల్లో జనతాపార్టీ నుంచి బయటకువెళ్లారు.

అధికారం చేజారాక రెండేళ్లకే అంతర్గత కలహాలతో జనతా పార్టీ కూలిపోయింది. మొదటగా 1979 జనవరి 1న వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో మండల్ కమీషన్ ను ఏర్పాటు చేయటానికి పూనుకున్న తరుణంలో మొరార్జీ దేశాయి ని ప్రధానమంత్రి పీఠం నుండి కూలగొట్టి, లోక్‌దళ్ నాయకుడు చరణసింగ్ కాంగ్రెస్ బలం తో ప్రధాని పీఠం ఎక్కినా అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది, కాంగ్రెస్ తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి ప్రధాని అయ్యారు. ఏకకాలంలో ద్వంద్వ సభ్యత్వం ఉండరాదని, అలాగే రాష్ట్రియ స్వయం సేవక్ సంఘ్ రోజువారీ కార్యక్రమాల్లో జనతా పార్టీ సభ్యులు ఎవ్వరు పాల్గొనకూడదని నిషేదించడంతో మొదలైన వివాదం చివరికి జనతా పార్టీలో చీలిక తెచ్చింది. పూర్వపు జనసంఘ్ నేతలు కూడా చివరికి ఆ పార్టీని వదలి బయటకు 
రావాలని ఆలోచన చేసి 1979 అక్టోబర్ నెలలో మాజీ జనసంఘ్ నేతల ఢిల్లోలో సమావేశమయ్యి కొత్తపార్టీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ 1980 జనవరి మొదటి వారంలోనే ఎన్నికలు రావటంతో వారు పార్టీని స్థాపించలేకపోయారు. 1980 ఎన్నికల్లో వాజ్ పాయి జనతా పార్టీ టికెట్ మీదనే పోటీచేసి గెలిచారు. ఎన్నికల అనంతరం మాజీ జనసంఘ్ నేతలు 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఈ భారతీయ జనతాపార్టికి అద్యక్ష పదవికి అటల్ బిహారీ వాజ్ పాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2 స్థానాలతో మొదటి అడుగు:-

ఇందిరా గాంధీ హత్యానoతరం 1984 డిసెంబరులో జరిగిన 8వ లోక్ సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు, చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అఖండ మెజారిటి ఇచ్చారు, నామినేటడ్ తో కలిపి 545 సీట్లకు గాను 385 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, వాజ్ పాయి అద్యక్షతన ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితం అయింది. ఇక ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలవ్వగా గెలిచిన ఇద్దరు అభ్యర్ధుల్లో ఒకరు గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుండి ప్రాతినిత్యం వహించిన ఏకే పటేల్ కాగా, రెండోది హన్మకొండ నుండి ప్రాతినిధ్యం వహించిన చందుపట్ల జంగారెడ్డి అవ్వడం విశేషం. అద్వానీ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక చంద్రశేఖర్ అధ్యక్షతన ఉన్న జనతా పార్టీ ఇదే ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకోవడం కొసమెరుపు. భారతీయ జనతా పార్టీకి ఎదురైన ఘోర ఫలితానికి భాద్యత వహిస్తూ అధ్యక్ష పదవికి అటల్ బిహారి వాజ్ పాయి రాజీనామా చేయగా , పార్టీ అధ్యక్ష పగ్గాలను లాల్ కృష్ణ అద్వానీ అందుకున్నారు.

రాజకీయ ప్రాణం పోసిన రామ జన్మభూమి:-

1980లో విశ్వహిందు పరిషత్ ఆద్వర్యంలో మొదలైన రామజన్మ భూమి ఉద్యమాన్ని అద్వానీ పార్టికి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత తన భుజాన వేసుకున్నారు. అయోద్య రామ జన్మభూమిలో రాముడి గుడి నిర్మించడం తమ ఎజండాలో మొదటిది అని ప్రకటించడమే కాకుండా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించటానికి సిద్దం అని ప్రకటన చేశారు. దీంతో రామజన్మ భూమి వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 1987 జనవరిలో దూరదర్శన్ చానల్ లో రామాయాణ దారావాహికం ప్రారంభం అవ్వడంతో ఆ ఉద్యమానికి ప్రజల్లో మరింత ఊతం ఇచ్చింది. 1989 డిసెంబర్లో జరిగే 9వ లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ముందు విశ్వ హిందు పరిషత్ , రాష్ట్రీయ స్వయం సేవక్ , ఆద్వర్యంలో రామజన్మ భూమిగా చెప్పబడే స్థలంలో శిలాన్యాసం చేయడంతో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి హిందూ సమాజంలో అనూహ్య మద్దతు పెరిగింది . దీంతో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లనుండి ఒక్కసారే 85 సీట్లకు ఎగపాకింది, కాంగ్రెస్ 197 సీట్లతో సరిపెట్టుకోగా జనతాదల్ పార్టీ 143 సీట్లు కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ , వామపక్షాలు నేషనల్ ఫ్రంట్ కి మద్దతు పలకగా నేషనల్ ఫ్రంట్ కన్వినర్ అయిన వి.పి సింగ్ ప్రధాని పీఠం ఎక్కారు.

మండల్ – మందిర్:-

మొరార్జీ దేశాయి పదవి కోల్పోవడంతో పక్కన పెట్టిన మండల్ కమీషన్ రిపోర్టును వి.పి సింగ్ అమలు చేయటానికి సిద్దపడ్డారు, 1990 ఆగస్టు 15న తాను ఇచ్చిన ఉపన్యాసంలో తాను మండల్ కమీషన్ అమలు చేసి వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పుకొచ్చారు. దీంతో ఉత్తర భారత దేశంలో అగ్ర వర్ణాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నెలల తరబడి రాస్తారోకోలు , బంద్ పాటించారు.
19 సెప్టెంబర్ 1990న రాజీవ్ గోస్వామీ అనే డిల్లీ దేశ్ బందు కాలేజీ విద్యార్ధి ఒంటికి నిప్పు అంటించుకోవడంతో ఉద్యమం హింసాత్మకం అయి పోలీస్ కాల్పుల్లో దేశవ్యాప్తంగా సుమారు 100మంది చనిపోయారు. దీంతో హిందు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనుకున్న సమయంలో అగ్ర వర్ణాల నుండి వి.పి.సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో దాని నుండి తమని కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ తన అజెండా ముందుకు తెచ్చింది. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోస్వామిని పరామర్శించిన అద్వానీ మండల్ కమీషన్ అమలు చేయటం ప్రధాని తీసుకున్న తొందర పాటు చర్య గా అభివర్ణించడంతో పాటు. రామ జన్మ భూమి అయోధ్యకు రధయాత్ర ప్రారంభిస్తునట్టు ప్రకటించారు .

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న తాను సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేయబోతునట్టు ప్రకటించారు. 10వేల కిలోమీటర్లు యాత్ర చేయబోతునట్టు, రోజుకు 300 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించి అక్టోబర్ 29నాటికి అయోధ్య చేరుకోబోతునట్టు ప్రకటించారు. దీంతో వి.పి సింగ్ ప్రభుత్వానికి నేరుగానే తనని అరెస్ట్ చేయమని సవాల్ విసిరినట్టు అయింది. అద్వానీ రధయాత్ర అక్టోబర్ 23న బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ రాగానే అద్వానీ మండల్ కమిషన్ హిందువుల మద్య చిచ్చు పెట్టడానికి పన్నిన కుట్రగా అభివర్ణించారు దీంతో లాలు ప్రసాద్ యాదవ్ యాత్రను అడ్డుకుని అద్వానీ ని , వారి బృందాన్ని అరెస్టు చేయించారు.

ఈ అరెస్టుకు నిరసన తెలుపుతు వి.పి సింగ్ ప్రభుత్వానికి బి.జే.పి తమ మద్దతు ఉపసంహరించుకుంటునట్టు ప్రకటించడంతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న వి.పి సింగ్ సంఖ్యా బలం లేక తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దిగిపోయారు. దీంతో జనతా దళ్ నుండి చీలి తన మద్దతు దార్లతో బయటికి వచ్చి సమాజ్ వాది జనతా పార్టీని స్థాపించిన చంద్రశేఖర్ రాజీవ్ గాంది మద్దతుతో ప్రధాని పీఠం ఎక్కినా 7నెలలకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించు కోవడoతో ప్రధాని పదవిని పోగొట్టుకున్నారు . దీంతో ఏ పార్టీకి అధికారాన్ని చేపట్టడానికి సరైన మెజారిటి లేనoదువలన ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

గుజరాత్ – ఉత్తర ప్రదేశ్ లో కాషాయ జండా:-

1991లో జరిగిన 10వ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూస్తే భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతానికి ప్రజలు ప్రభావితం అయినట్టే కనిపిస్తుంది. అయోధ్య రగడ జరిగి ఏడాది గడవక ముందే జరిగిన ఎన్నికల్లో రధయాత్ర జరిగిన ప్రాంతాలు, గుజరాత్ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరధం పట్టాయి, గుజరాత్లో 26స్థానాల్లో పోటీ పడితే 10 స్థానాలు గెలుచుకుంది. ఉత్తర ప్రదేశ్లో పోటీ చేసిన 84 స్థానాలకు గాను 51 స్థానాలు కైవసం చేసుకుంది . మొత్తంగా చూస్తే గతంలో కన్న మరింత ఎక్కువ 120 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుని మొదటిసారి సొంతంగా 100 సీట్లు దాటగలిగింది. దీంతో భారతీయ జనతా పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించింది.

అయోధ్య అజెండా తమకు సత్ఫలితాలు ఇస్తుందన్న నమ్మకం బలపడడంతో భారతీయ జనతా పార్టీ మరో మెట్టు ఎక్కింది. ప్రధానిగా పి.వి నరసింహారావు భాద్యతలు చేపట్టిన రోజు నుండే నిప్పుని చల్లారనీయకుండా ఎగదోస్తూనే వచ్చారు. అయితే పి.వి నరసింహారావు సామరస్య పరిష్కారమే శరణ్యం అన్న దృక్పదంతో వివాదం అంతటిని సుప్రిం కోర్టుకు సమర్పించారు. అయితే సుప్రీం కోర్టు కర సేవకు మసీదు జోలికి పోరాదు అని ఆదేశిస్తే విశ్వహిందు పరిషత్ నేతలు దానికి సమ్మతిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటాం అని మసీదు జోలికి పోము అని, భజనలు , కీర్తనలు ద్వారానే కరసేవ చేసి సరిపెడతామని నమ్మబలికారు , తీరా 1992 డిసెంబర్ 6న లక్షలాది మంది కరసేవకులు అద్వానీ ప్రసంగిస్తున్న సమయంలోనే బాబ్రి మసీద్ పై దాడి చేసి ధ్వంసం చేశారు, ఈ ఘాతుకానికి విశ్వ హిందు పరిషత్, ఆర్.ఎస్.ఎస్ , కర సేవక్ సంస్థలు మూకుమ్మడిగా ప్రణాళికలు రూపొందించినట్టు విమర్శలు ఉన్నాయి . ఇది ఇలా ఉండగా ఈ లోపు 1996 ఏప్రిల్ లో 11వ లోక్ సభ ఎన్నికలు రానే వచ్చాయి.

13 రోజుల ప్రధాని పదవి:-

1996 ఏప్రిల్ లో 11వ లోక్ సభ ఎన్నికలు రానే వచ్చాయి. గత కాంగ్రెస్ పాలనలో హర్షద్ మెహతా స్కాం, టెలిఫోన్ స్కాం, చక్కెర స్కాం , హవాలాలతో ప్రజా ప్రతినిధులపై లంచాల ఆరోపణలు అధికం అవ్వడం, స్వాతంత్రం వచ్చాక నెహ్రు కుటుంభం ప్రస్తావన లేకుండా జరిగిన ఎన్నికలు కావడం , భారతీయ జనతా పార్టీ రామ జన్మభూమి వివాదాంతో ఓట్ బ్యాంక్ మరింతగా పెంచుకోవడం లాంటి పరిణామాలతో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే మరింత పుంజుకుని పార్లమెంట్ లో 163 స్థానాలు కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 140 స్థానలకు పరిమితం అవ్వడంతో రాజ్యంగంలో స్పష్టంగా అతి పెద్ద పార్టీని పిలవాలి అని నియమం ఉండటంతో రాష్ట్ర పతి శంకర్ దయాళ్ శర్మ గారు వాజ్ పాయి గారిని పిలిచి బల నిరూపణ కి అవకాశం ఇచ్చినా బలనిరూపణ చేసుకోవటంలో విఫలం చెందిన వాజ్ పాయి 13 రోజులకే ప్రధాని పదవి నుండి దిగిపోయారు.

కాంగ్రెస్ , కమ్యునిస్టుల మద్దతుతో జనతా దల్ (యునైటెడ్ ఫ్రంట్) అనే పేరుతో సమాజ్ వాది పార్టీ డి.యం.కే. అస్సాం ఘన పరిషద్ , తమిళ మానిల కాంగ్రెస్ , తెలుగుదేశం మద్దతుతో ప్రభుత్వం ఏర్పర్చటానికి నిచ్చయించుకుని , జనతాదళ్ పార్టీ వి.పి సింగ్, కమ్యునిష్టు పార్టీ జ్యోతి బసు గారి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అంగీకారంతో కర్నాటక కి చెందిన దేవ గౌడ 1996 జూన్ 1 న ప్రధాన మంత్రి గా ప్రమాణ శ్వీకారం చేశారు. దేవ గౌడ 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు ప్రధానిగా చేశాక ఈ ఫ్రంట్ కి కాంగ్రెస్ కి వచ్చిన అభిప్రాయ భేదాల వలన కాంగ్రెస్ సీతరాం కేసరి దేవ గౌడకి మద్దతు ఉపసంహ రించుకుని జనతాదల్ పార్టీ కి చెందిన ఐ.కే గుజరాల్ ని ప్రధానిని చేశారు.

ఐ.కే గుజరాల్ 1997 ఏప్రిల్ 21 నుండి 1998 మార్చ్ 19 వరకు ప్రధాని గా చేశారు. అకస్మాతుగా జైన్ కమీషన్ రిపోర్టు బయటికి రావడం , రాజీవ్ గాంది హత్యలో పాల్గొన్న ఎల్.టి.టి.ఈ టెర్రరిస్ట్ సంస్థకు కరుణా నిధికి మద్య ఉన్న సంబందాలు ఆ రిపోర్టు తో వెలుగులోకి రావడంతో చెలరేగిన వివాదం చివరికి కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు ఉపసంహరణ వరకు దారి తీసి ఐ.కే.గుజరాల్ ప్రభుత్వం పార్లమెంటు లో మేజారిటీ కోల్పోవడంతో ప్రధాని పదవికి ఐ.కే గుజ్రాల్ స్వచందంగా రాజీనామ చేసి రాష్ట్రపతి కే.ఆర్ నారాయణకి పంపడంతో ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి కోల్పోయిన వాజ్ పాయి:-

12వ లోక్ సభ ఎన్నికల్లో 182 స్థానాలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఒక వైపు సోనియా గాంధీ తొలిసారి చేసిన ప్రచారంతో 141 సీట్లు సాదించిన కాంగ్రెస్ మరో వైపు నిలిచాయి, ఈ ఎన్నికలలో కూడా ఎవరికి సాధ్యమైనంత మెజారిటి రాక బిజేపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది . అప్పటిదాక యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న బాబు రాత్రికి రాత్రే ఎవరికి చెపకుండా బి.జే.పి కూటమిలో చేరిపోయారు – తన 12 మంది ఎంపీల చేత బి.జే.పి కి ఓటు వేయించి బాలయోగిని స్పీకర్ చేయాలి అని బి.జే.పి కి చెప్పాడు . దీంతో బిజేపి బలం అన్నా డియంకే పార్టీ మద్దతుతో కలిపి 276కి చేరడంతో విశ్వాస పరీక్షలో విజయం సాధించిన వాజ్ పాయి 1998 మార్చ్ 19న ప్రధాని పీఠం అదిరోహించారు.

అయితే 12వ లోక్ సభ 1999 ఏప్రిల్ 17 న ఏ.ఐ.డి.యం.కే పార్టీ జయలలిత అభిప్రాయ భేదాల వలన బి.జే.పి కూటమిలో నుండి తప్పుకోవటంతో వాజ్ పాయి బల నిరూపణలో విఫలమై ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది – కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి రాష్ట్రపతి పిలిచినా అతుకుల బొంతతో నడపలేను అని సోనియా ఒప్పుకోలేదు దీంతో 12వ లోక్ సభ రద్దు అయింది.

మూడవ సారి ప్రధాని అయిన వాజ్ పాయి:-

జయలలిత మద్దతు ఉపసంహరణతో బల పరిక్షలో వాజ్ పాయి ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోవడం అదే సమయంలో కార్గిల్ యుద్దంలో విజయం సాదించడంతో భారతీయ జనతా పార్టీ మీద దేశవ్యాప్తంగా సానుభూతి పవనాలు వీచాయి, దీంతో 1999 అక్టోబర్ లో జరిగిన 13వ లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్‌సభ లో 303 స్థానాలు గెలిచి మళ్లీ వాజ్ పాయి ప్రధాని అయ్యారు. అయితే బంగారు లక్ష్మణ్ ముడుపుల కేసు, పార్లమెంటు మీద ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి, గుజరాత్ హింసాకాండ వెరసి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో 2004 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి తిరిగి డిల్లీ పీఠం అదిరోహించడం కోసం 10 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది.

అనూహ్యంగా దూసుకొచ్చిన మోడి :-

ఏ.బి.వి.పి నాయకుడిగా, విశ్వహిందు పరిషత్ కార్యకర్తగా ,అర్ ఎస్ ఎస్ సైనికుడిగా శిక్షణ పొందిన నరేంద్రమోడీ 1987లో భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి అనతికాలంలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. అద్వానీ చేపట్టిన రధ యాత్రకు ఇంచార్జ్ గా భాద్యతలు నిర్వహించిన మోడీ 1998లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. గుజరాత్‌లో సంభవించిన భూకంపం ఆ తరువాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టింది. అప్పటి నుంచి 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.

2002 ఫిబ్రవరి 27 న గుజరాత్ లో గోద్రా రైలు దహనం తదనంతరం జరిగిన గుజరాత్ అల్లర్లకు వెనక నరేంద్ర మోడి హస్తం ఉందనే మరక మోడీ జీవితంలో ఒక కళంకంగా చెప్పవచ్చు. 2014 ఎన్నికల సమయానికి మోడీ ఏర్పరుచుకున్న ప్రత్యేక టీం మోడీ పేరుని బ్రాండ్ గా ప్రచారం చేయటంలో పూర్తిగా సఫలీకృతం అయ్యారు, యువతకి దగ్గర అయ్యే విదంగా అనేక మార్కెటింగ్ టాక్టిస్లను అమలు చేసి ప్రచారం సాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, అవీనీతి, బందు ప్రీతి పై పూర్తిగా విసిగిపోయి ఉన్న దేశ ప్రజలను మోడీ మార్కెటింగ్ మాయజాలం పూర్తిగా ఆకర్షించిందనే చెప్పాలి, దీంతో 2014 జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 10ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత 282 స్థానాలు గెలుచుకుని మోడీ ప్రధాని పీఠం అధిరోహిస్తే 10ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీవినీ ఎరగని రీతిలో 44 స్థానాలకు పడిపోయింది. 5 ఏళ్ళ పాలన్లో దీమానిటైజేషన్, స్వచ్ భారత్, మేకిన్ ఇండియా లాంటి వాటిని తన మార్కెటింగ్ చాతుర్యంతో ప్రచారం చేసుకోవడంలో మోడీ పూర్తిగా సఫలీకృతం అవడంతో తిరిగి 2019 లో మోడీ అధ్యక్షతన ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టి 303 స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారం చేపట్టింది.

40 ఏళ్ళ ప్రస్తానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కున్న భారతీయ జనతా పార్టీ తమ విధానం , ఆలోచన సహేతుకమే అని ప్రజలను సైతం మెప్పించడం కాస్త ఆశ్చర్యం కలిగించినా , అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి బాటలు వేసాయనే చెప్పుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి